య‌మ డేంజ‌ర్ అన్న కేర‌ళ ఇప్పుడెలా ఉందో తెలుసా?

దేశంలో ముందుగా క‌రోనా ప్ర‌మాద‌క‌ర స్థాయిలో విస్త‌రించిన రాష్ట్రాల్లో కేర‌ళ ఒక‌టి. ద‌క్షిణాదిన తొలి క‌రోనా కేసు న‌మోదైంది కూడా ఆ రాష్ట్రంలోనే. ఏపీ, తెలంగాణ‌ల్లో కేసులు సింగిల్ డిజిట్లో ఉన్న స‌మ‌యంలో కేర‌ళ‌లో కేసులు ప‌దుల సంఖ్య‌లోకి వెళ్లిపోయాయి. విదేశాల నుంచి వ‌చ్చిన ఓ కుటుంబం ఇంటి ప‌ట్టున ఉండ‌కుండా పెళ్లిళ్లు, ఇత‌ర వేడుక‌ల‌కు వెళ్లి క‌రోనాను వ్యాప్తి చేయ‌డంతో కేర‌ళ చాలా త్వ‌ర‌గా డేంజ‌ర్ జోన్లోకి వెళ్లిపోయింది. అక్క‌డ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతుండ‌టం చూసి అంతా కంగారు ప‌డ్డారు. కానీ త‌ర్వాత తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. మ‌న జ‌నాల దృష్టి కేర‌ళ మీద నుంచి ఇటు మ‌ళ్లింది. వేరే రాష్ట్రాల గురించి ప‌ట్టించుకునే ప‌రిస్థితే లేక‌పోయింది. ఐతే ఇప్పుడు కేర‌ళలో క‌రోనా వ్యాప్తి, మ‌ర‌ణాల రేటు ఏ స్థాయిలో ఉంది అని ఓసారి ప‌రిశీలిస్తే షాక‌వ‌డం ఖాయం.

కేర‌ళ‌లో మొత్తం ఇప్ప‌టిదాకా వెలుగులోకి వ‌చ్చిన క‌రోనా కేసులు 500 లోపే ఉండ‌టం విశేషం. అందులో 460 మంది దాకా క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసులు కేవ‌లం 30 మాత్ర‌మే. వారికి అత్యుత్త‌మ చికిత్స అందిస్తున్న నేప‌థ్యంలో ఇంకొన్ని రోజుల్లో డిశ్చార్జి అవుతార‌ని అంటున్నారు. ఇప్ప‌టిదాకా కేర‌ళ‌లో క‌రోనా కార‌ణంగా మృతి చెందిన వ్య‌క్తులు ముగ్గురు మాత్ర‌మే. క‌రోనా విష‌యంలో చాలా ముందుగా అప్ర‌మ‌త్త‌మై క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం.. అక్ష‌రాస్య‌తలో దేశంలోనే నంబ‌ర్ వ‌న్ అయిన ఆ రాష్ట్ర జ‌నాలు కూడా వైర‌స్‌పై పూర్తి అవ‌గాహ‌న‌తో అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం.. రోగుల‌కు ఉత్త‌మ చికిత్స అంద‌డంతో కేర‌ళ విజ‌య‌వంతంగా క‌రోనాపై విజ‌యం సాధించింది. బుధ‌వారం కేర‌ళ‌లో ఒక్క‌టంటే ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేదు. ఇంకొన్ని రోజుల్లోనే కేర‌ళ క‌రోనా ఫ్రీ స్టేట్‌గా మార‌బోతోంది.