మన తెలుగు నాయకుడు, కేంద్రంలో ఒకప్పుడు చక్రంతిప్పి.. నేడు .. రాజ్యాంగ పరిధిలోని అత్యున్నత స్థాయి అయిన ఉపరాష్ట్రపతి పొజిషన్‌లో ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు.. ఎక్కడ ఉన్నా.. తనదైన స్టయిల్‌లో దూసుకుపోతుంటారు. తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టు తో ఆయన ఢిల్లీలో చక్రం తిప్పిన రోజుల నుంచి నేడు రాజ్యసభ చైర్మన్‌గా.. ఉపరాష్ట్రపతిగా కూడా తెలుగు వారి కీర్తిని ఇనుమడింపజేస్తున్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు.. దేశం యావత్తును సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతున్నాయి.
ఇటీవల పార్లమెంటు నివేదిక వెల్లడైంది. దీనిలో రాజ్యసభలో ప్రాంతీయభాషలకు పట్టకట్టిన చైర్మన్‌గా వెంకయ్య నిలిచారు. ముఖ్యంగా ఎవరూ ఎప్పుడూ ప్రవేశ పెట్టని.. సంతాలీ(గిరిజన భాష) భాషను సైతం రాజ్యసభల అనుమతించారు. అదేసమయంలో ప్రాంతీయ భాషలను ప్రొత్సహించేందుకు ఆయన సెమినార్లు సైతం కండక్ట్ చేస్తున్నారు. దీంతో పార్లమెంటులో మాట్లాడాలంటే.. హిందీనో.. ఇంగ్లీషో వచ్చి ఉండాలని అనుకునే రోజుల నుంచి ఎవరైనా ఏ భాషలోనైనా మాట్లాడొచ్చనే దాకా పార్లమెంటు స్థాయిని పెంచి.. ప్రజలకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఇక, ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు వెంకయ్య.. రాజ్యసభలో మొబైల్ ఫోన్స్, సెల్ ఫోన్స్, ట్యాబ్స్ వంటివాటిని ఎవరూ వాడరాదంటూ సభ్యులను గట్టిగానే ఆదేశించారు. సభ జరుగుతున్న సమయంలో కొంతమంది సభ్యులు మొబైల్స్ వాడడమే కాకుండా.. సభా కార్యకలాపాలను కూడా వీడియోలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉన్నతమైన రాజ్యసభ చాంబర్లో కూర్చుని కూడా సభ్యులు ఇలా వీడియోలు తీయడం పార్లమెంటు నిబంధనలకు విరుద్ధమని అన్నారు. అందువల్ల ఇక నుంచి ఎవరూ కూడా చాంబర్లలో కానీ, సభా ప్రాంగణంలో కానీ మొబైల్స్ వాడడానికి వీల్లేదని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఇలా సభ్యులు మొబైల్ ఫోన్‌లు వాడరాదనే ఆదేశాలు స్వతంత్ర భారత దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషమని అంటున్నారు మేధావులు.