ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటి నుంచి అనూహ్యమైన కామెంట్లు వచ్చాయి. సీఎం జగన్ తండ్రి.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని కొనియాడారు నిమ్మగడ్డ. వైఎస్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. నేనీ స్థితిలో ఉండేందుకు వైఎస్సే కారణం. ఆయన.. నిజాలను నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేయడం వల్లే నా జీవితంలో ఒక గొప్ప మలుపు వచ్చింది. వైఎస్ దగ్గర ఫైనాన్స్ సెక్రటరీగా పని చేశా అని నిమ్మగడ్డ గుర్తు చేసుకున్నారు.
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఆయన జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్న నిమ్మగడ్డ.. అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డికి.. తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు వైఎస్ఆర్ ఆశీస్సులు ఉన్నాయన్నారు. వైఎస్‌కు రాజ్యాంగం పట్ల గొప్ప గౌరవం ఉందని, కీలక అంశాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించారని అన్నారు. ఏ వ్యవస్థని ఎప్పుడూ తప్పు పట్టలేదన్నారు. ఆయన దగ్గర పని చేసినప్పుడు తానెప్పుడూ ఇబ్బంది పడలేదన్నారు.
అయితే… తనను ఏ శక్తి అడ్డుకోలేదని, అడ్డుకోబోదని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల వైఎస్‌కు ఎంతో గౌరవం ఉండేదన్నారు. దివంగత నేత వైఎస్‌లో లౌకిక దృక్పథం ఉండేదన్నారు. రాజ్యాంగం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఎన్నికలు సకాలంలో జరగాలన్నారు. అసాధారణ ఏకగ్రీవాలు చేస్తే సమర్థనీయం కాదన్నారు. వెనుకబడిన వారిని ప్రోత్సహించడమే సమన్యాయమన్నారు. బెదిరింపులకు పాల్పడే వారిపై షాడో టీమ్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మొత్తానికి నిమ్మగడ్డ వ్యాఖ్యలు సంచలనంగా మారడం విశేషం. ఇప్పుడున్న వైసీపీ వేడిని ఆయన తగ్గించే ప్రయత్నం చేశారా? లేక.. ఈ వ్యాఖ్యల వెనుక అంతరార్థం వేరే ఏదైనా ఉందా? అనే చర్చ సాగుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates