రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించని సీన్ ఒకటి కనిపించింది. అందుకు టీడీపీకి చెందిన యువ ఎంపీ కారణంగా కావటం విశేషం. సాధారణంగా విదేశాల్లో పెటర్నిటీ లీవ్ మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంటుంది. దేశీయంగా కొన్ని రంగాలకు చెందిన కార్పొరేట్ ప్రపంచంలో ఈ మాట వినిపిస్తుంది. రాజకీయాల్లో ఇలాంటి మాటలకు చోటు ఉండదు. అందుకు భిన్నంగా ఏపీ టీడీపీకి చెందిన ఎంపీ ఒకరు లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు. అందులో ఆయన పేర్కొన్న అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ప్రస్తుతం లోక్ సభ బడ్జెట్ సమావేశాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 29 నుంచి మొదలైన పార్లమెంటు సమావేశాలు వచ్చే నెల (ఫిబ్రవరి) వరకు సాగనున్నాయి. అయితే.. తనకు సెలవులు అవసరమని లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకు లేఖ రాశారు శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు. తనకు తొమ్మిది రోజుల పాటు పెటర్నిటీ లీవు కావాలని కోరారు. తన భార్య నిండు గర్భిణి అని.. పది రోజుల్లో డెలివరీ అయ్యే అవకాశం ఉందని.. ఆ సమయంలో ఆమె వద్ద ఉండటం అవసరమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కారణంతోనే తాను బడ్జెట్ సమావేశాలకు పాల్గొనటం లేదన్నారు. ఈ కారణంగానే తనకు సెలవులు మంజూరు చేయాలన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా భయాందోళనలు ఉన్న నేపథ్యంలో.. పుట్టిన బిడ్డ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్న రామ్మోహన్ నాయుడు.. బయట తిరిగి పిల్లాడి దగ్డరకు వెళితే ఇబ్బంది ఉంటుందన్నారు. పిల్లల బాధ్యత తల్లిదే కాదని.. తనది కూడా సమాన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకే తనకు సెలవు కావాలని కోరారు.
ఇంత సున్నితంగా ఆలోచించే రాజకీయ నేతలు చాలా అరుదుగా ఉంటారని చెప్పాలి. పెటర్నిటీ లీవు ద్వారా కొత్త విధానానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు తెర తీశారని చెప్పక తప్పదు. ఏమైనా.. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న రాజకీయ నేత.. తన భార్య గర్భవతిగా ఉన్న సమయంలో ఆమెకు తోడుగా ఉండాలని అనుకోవటం ప్రశంసించాల్సిన అంశంగా చెప్పక తప్పదు.