జగన్ స్వగ్రామంలో టీడీపీ జెండా రెపరెపలు

రాష్ట్రంలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధిపత్యం స్పష్టంగా నిరూపించుకుంది.  మున్సిపల్ ఎన్నికల నుంచి కొనసాగుతున్న విజయ పరంపర పంచాయతీ ఎన్నికల్లో కూడా కొనసాగింది. చివరికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా, మున్సిపాలిటీ, మండలంలతో పాటుగా పంచాయతీని కూడా టీడీపీ ఎగరేసుకొని పోయింది. దాంతో వైసీపీకి సంపూర్ణ పరాజయం దక్కినట్టయ్యిందన్న మాట వినిపిస్తుంది.

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలోని బలపనూరు పంచాయతీ వైఎస్ రాజశేఖరరెడ్డి స్వగ్రామం. ఇక్కడ గత 40 ఏళ్లుగా వైఎస్ పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది. అయితే తొలిసారిగా ఇప్పుడు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

బలపనూరులో మొత్తం 2,269 మంది ఓటర్లు వున్నారు. పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా టీడీపీ బలపరిచిన కొత్తరెడ్డి అనిల్‌కుమార్‌రెడ్డి పోటీ చేశారు. వైసీపీ తరఫున ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో అనిల్‌కుమార్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది.

ఈ నెల 1 వ తేదిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ తన సొంత మేనత్త వైఎస్ ప్రమీలమ్మను పోటీ చేయించారు. ఆమె మీద టీడీపీ అభ్యర్థిగా తూగుట్ల గీతాకుమారి పోటీకి దిగారు. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గీతా కుమారి విజయం సాధించారు. మొత్తం 40 వార్డులకు గాను 34 వార్డులు టీడీపీ గెలుచుకుంది. వైసీపీకి కేవలం మూడు వార్డులు మాత్రమే దక్కాయి. ఆ తర్వాత జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీ దాదాపుగా క్లిన్ స్వీప్ చేసింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో సైతం అత్యధిక స్థానాలు దక్కించుకుంది.