ఏపీ సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు గురువారం ఉదయమే.. తమ ఓటు హక్కును వినియోగించుకు న్నారు. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా వారు ఓటు వేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి కలిసి ఓటు వేశారు. అమరావతి సమీపంలోని ఉండవల్లి మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు వేసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ డబ్బు తీసుకోకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేస్తేనే నాయకులను ప్రశ్నించే నైతిక హక్కు ఉంటుందని ఆయన అన్నారు. అది కూడా ఓటు వేసేందుకు డబ్బులు తీసుకోకుండా ఉండాలని ఆయన సూచించారు. అప్పుడు మాత్రమే ప్రజల విషయంలో ప్రజాప్రతినిధులకు బాధ్యత, జవాబు దారీ తనం ఉంటాయని పేర్కొన్నారు.
మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు గా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారిని పార్టీ ప్రకటించింది. మేయర్ అభ్యర్థిగా టీడీపీ తరఫున పేరం ఏడుకొండలు, వైఎస్సార్సీపీ తరఫున కేలావత్ పున్నా నాయక్ పోటీ చేస్తున్నారు. కార్పొరేషన్ మేయర్ పదవి ఎస్టీ (జనరల్) వర్గానికి రిజర్వ్ అయింది. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు కలిపి మేయర్ పదవికి మొత్తం 8 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పైగా.. మంగళగిరి, తాడేపల్లి స్థానానికి సుమారు 15 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ ప్రాంతంలోనే టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల కేంద్ర కార్యాలయాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆయా పార్టీల అధినేతలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైసీపీ విషయానికి వస్తే.. బలం తక్కువగానే కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వర్గం. కూటమికి అనుకూలంగా మారిపోవడంతో టీడీపీ బలం పుంజుకుంది. దీనికితోడు మంత్రి నారా లోకేష్ అభివృద్ధి మంత్రం కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates