ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం జరుగుతున్న క్రమంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో ఎలాంటి బరులు, గిరులు, పట్టింపులు లేవని ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్ వేయొచ్చని ప్రకటించింది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరుతో పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. గ్రామాల అభ్యున్నతి, స్వేచ్ఛాయుత పాలన.. మహాత్మాగాంధీ కలల సాకారం వంటివి గ్రామాలతోనే సాధ్యమని పేర్కొన్న పవన్ కల్యాణ్.. ఎట్టి పరిస్థితిలోనూ ఈ విషయంలో పార్టీ ఎవరికీ అడ్డంకులు చెప్పదన్నారు.
ఏ గ్రామంలో అయినా.. జనసేన మద్దతుతో పోటీకి రెడీ కావాలని అనుకుంటే.. అలాంటివారంతా నామినేషన్ వేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. వీరిని పార్టీ నాయకులు అడ్డుకోరాదన్నారు. పైగా వారికి సహకరించి.. నామినేషన్ వేసేందుకు ప్రోత్సహించాలని సూచించారు.
వీర మహిళలు, జనసైనికులు ఎవరైనా పంచాయతీ ఎన్నికల్లో స్వేచ్ఛగా పోటీ చేయొచ్చని పేర్కొన్నారు. ఇక, కూటమి పొత్తు విషయాన్ని ప్రస్తావిస్తూ.. స్థానిక మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పుకొచ్చారు.
అయితే.. గ్రామీణ ఎన్నికల్లో ఇలాంటి పంపకాలు ఏమీ ఉండబోవని జనసేనాని పేర్కొన్నారు. ఇవి ఒక జెండాపైనా.. ఒక పార్టీ గుర్తుపైనా జరిగే ఎన్నికలు కాదని.. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ప్రజలు ఎన్నుకొనే ఈ పంచాయతీ స్థానాలను కూటమి పార్టీలకు అతీతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
దీనిలో పౌరుల స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు. ఎవరైనా సరే స్వేచ్ఛగా ఈ ఎన్నికల్లో పాల్గొన వచ్చని పేర్కొన్నారు. జనసేన పార్టీ మద్దతు దారులుగా రంగంలోకి దిగి.. పోటీ చేయాలని భావించే వారికి సంపూర్ణంగా శ్రేణులు, నాయకులు మద్దతు ఇవ్వాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates