హాట్ అప్‌డేట్.. థియేటర్ల ఆక్యుపెన్సీ పెరగబోతోంది

కరోనా వల్ల దాదాపు ఏడు నెలలు మూత పడ్డ థియేటర్లను గత ఏడాది అక్టోబరులో తెరుచుకునేందుకు అనుమతులిచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఆక్యుపెన్సీని మాత్రం 50 శాతానికే పరిమితం చేసింది. మూడు నెలలు దాటినా అలాగే థియేటర్లు నడుస్తున్నాయి. ఈ మధ్య తమిళనాట అక్కడి రాష్ట్ర ప్రభుత్వం 100 పర్సంట్ ఆక్యుపెన్సీకి అనుమతులిచ్చింది కానీ.. తర్వాత కేంద్రం బ్రేక్ వేసింది. ఐతే ఇప్పుడు కేంద్రం సినీ పరిశ్రమకు ఊరటనిచ్చేలా నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కొత్త మార్గదర్శకాల్లో భాగంగా థియేటర్ల ఆక్యుపెన్సీని పెంచుకునే అవకాశం కల్పించనున్నట్లు బుధవారం వెల్లడించింది.

ఐతే 100 పర్సంట్ ఆక్యుపెన్సీకి మాత్రం అవకాశం ఇస్తున్నట్లుగా కనిపించడం లేదు. 50 పర్సంట్ నుంచి ఆక్యుపెన్సీని పెంచబోతున్నట్లు మాత్రం పేర్కొంది ప్రభుత్వం. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వస్తాయని తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమలు కానున్నాయి. అంటే నెలాఖర్లోపే ఆక్యుపెన్సీ ఎంత అనేది తేలబోతోంది. బహుశా ఆక్యుపెన్సీని 75 శాతానికి పెంచుతారని.. వేసవి సమయానికి అది 100 పర్సంట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇటీవలే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మొదలు కావడం, ఇప్పటికే కరోనా కేసులు గణనీయంగా తగ్గడం.. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు గత ఏడాది మార్చి మధ్య నుంచి దేశవ్యాప్తంగా మూత పడి ఉన్న స్విమ్మింగ్ పూల్స్‌ను తెరిచేందుకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి పూల్స్ తెరుచుకోనున్నాయి. అంటే ఈ వేసవిలో పూల్స్ మళ్లీ జనాలతో కళకళలాడబోతున్నాయన్నమాట.