17 ఏళ్లుగా జైల్లో ఉన్నారు… ఇక ఇంటికి పంపేయ‌చ్చు

“దాదాపు 17 ఏళ్ల‌కుపైగానే దోషులు జైల్లో ఉన్నారు. ఇక‌, చాలు. వారిని ఇంటికి పంపేయొచ్చు.“ అని 2002 నాటి బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో దోషుల‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. సుదీర్ఘకాలంగా జైల్లో ఉన్న కారణంగా బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు చేసింది. విపిన్‌చంద్ర కన్హయ్యలాల్ జోషి, ప్రదీప్ రమణ్‌లాల్ మోధియా అనే ఇద్దరు దోషుల జీవిత ఖైదును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేలతో కూడిన ధర్మాసనం ఉత్త‌ర్వులు ఇచ్చింది.

ఈ కేసులో దోషులుగా తేలిన ఇద్ద‌రు ఇప్పటికే 17 ఏళ్లకు పైగా కారాగార శిక్షను అనుభవించారని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దోషుల్లో ఒకరైన విపిన్‌చంద్ర జోషి తీవ్రమైన శారీరక వైకల్యంతో బాధపడుతున్న విషయాన్ని ధర్మాసనం గమనించింది. 2017లో బాంబే హైకోర్టు విధించిన జీవిత ఖైదు తీర్పును సవాలు చేస్తూ వీరిద్దరూ దాఖలు చేసిన అప్పీలులో వాస్తవ, చట్టపరమైన అంశాలను ఇంకా లోతుగా పరిశీలించాల్సి ఉందని న్యాయస్థానం పేర్కొంది. సంబంధిత విచారణ కోర్టు విధించే నిబంధనలు, షరతులకు లోబడి వీరికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

దేశాన్ని కుదిపేసిన కేసు!

2002లో గుజరాత్ లో చెల‌రేగిన అల్లర్ల సమయంలో గర్భిణి అయిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరగడంతో పాటు, ఆమె కుటుంబంలోని ఏడుగురు హత్యకు గురయ్యారు. ఈ కేసులో దోషులుగా తేలిన 11 మందికి బాంబే హైకోర్టు జీవిత ఖైదు విధించింది. చిత్రం ఏంటంటే.. గుజ‌రాత్‌లో అయితే త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌ని బాధిత కుటుంబీకుల ప‌క్షాన దాఖ‌లైన పిటిష‌న్‌ను విచారించిన సుప్రీంకోర్టు అప్ప‌ట్లో ఈ కేసును బాంబే హైకోర్టుకు బ‌దిలీ చేసింది. దీనిని విచారించిన కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. అయితే.. 2022లో గుజరాత్ ప్రభుత్వం ముందస్తు విడుదల చేసింది. ఇది అప్ప‌ట్లో పెను వివాదానికి దారితీసింది.

రేప్ కేసు నిందితుల‌ను బ‌య‌ట‌కు వ‌ద‌ల‌డం, దోషుల‌కు బీజేపీ నాయ‌కులు పూల దండ‌లు వేసి ఊరేగింపుగా తీసుకువెళ్ల‌డం అప్ప‌ట్లో తీవ్ర వివాదానికి దారితీసింది. దీంతో ఈ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. 2024 జనవరిలో సుప్రీంకోర్టు దీనిని విచారించి.. గుజ‌రాత్ ప్ర‌భుత్వం ఇచ్చిన‌ ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో దోషులందరూ తిరిగి లొంగిపోయి జైలుకు వెళ్లారు. అనంత‌రం.. వీరిలో ఇద్ద‌రు దోషులు అప్పీల్ చేసుకోగా.. తాజాగా వారికి బెయిల్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.