ఎన్నికలు ఏవైనా డబ్బులతోనే ముడి పడి ఉంటున్నాయి. సొమ్ములు ఇచ్చి ఓట్లు వేయించుకునేందుకు నాయకులు, తీసుకునేందుకు ఓటర్లు కూడా ఎక్కడా సంకోచం చెందడం లేదు. ఏపీలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలోనూ ఓటర్లకు నాయకులు డబ్బులు జోరుగానే పంచారు. పార్టీలకు అతీతంగా అందరూ ఈ పనిలో తమ శక్తినంతా ధారపోశారు. అయితే.. అనూహ్యంగా ఓ ఓటరు మాత్రం తనకు ఇచ్చిన సొమ్మును తిరిగి బ్యాలెట్ బాక్స్‌లోనే వేసిన ఘటన చిత్తూరుజిల్లా పలమనేరులో చోటు చేసుకుంది. ఒకింత ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సదరు ఓటరు చూపిన చైతన్యం ప్రజాస్వామ్య వ్యవస్థలో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
పలమనేరులో రూరల్ పరిధిలోని మురం, గ్రామంలో ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఒక ఓటరు పోలింగ్ బూత్ కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. పలమనేర్ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయన చేసిన పని పోలింగ్ సిబ్బందికి ఆశ్చర్యంతో పాటు ఆలోచనను రేకెత్తించింది. “అయ్యా.. మీరిచ్చిన డబ్బు రూ.1000 మీరే తీసుకోండి. నేను డబ్బు తీసుకుని ఓటు వేయను. ధన్యవాదాలు..” అని ఓ కాగితంపై రాసి ఆ ఓటరు వ్యక్తి రెండు రూ.500 నోట్లను ఏకంగా బ్యాలెట్ బాక్స్‌లో వేశాడు. పోలింగ్ అధికారులు, సిబ్బంది ఆ చీటీని, నోట్లోను ఆసక్తిగా పరిశీలించారు.
‘ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలు చాలా స్ఫూర్తిదాయకమైన చర్య’ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. నోట్లకు ఓటును తాకట్టు పెట్టని ఆ ఓటరు నిజాయితీ, ప్రజాస్వామ్య విలువలపై అతనికి ఉన్న గౌరవానికి నిదర్శనం. ఎన్నికల్లో డబ్బు, మద్యం ఏరులై పారుతున్న వేళ… ఈ ఘటన ఓటర్లలో చైతన్యానికి ప్రతీకగా నిలిచింది. డబ్బు తీసుకుని ఓటేస్తే ఐదేళ్లు ప్రశ్నించే హక్కును కోల్పోతామని ఈ ఓటరు చాటిచెప్పాడు. అతని ఈ సాహసోపేత నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అభ్యర్థులు ఇచ్చే నోట్ల కంటే, ఓటరు తెలివైన నిర్ణయమే గొప్పదని ఈ ఘటన రుజువు చేసింది. అని కలెక్టరు పేర్కొనడం గమనార్హం.
సాధారణంగా.. తమ తమ గ్రామాల్లోని.. మండలాల్లోని సమస్యలను ఎక్కువ మంది ప్రస్తావిస్తూ.. చీటీలు బ్యాలెట్ బాక్స్‌ల్లో వేయగా.. పలమనేరులో మాత్రం ఓటరు తనకు ఎన్నికలకు ముందు ఇచ్చిన నోట్లను బ్యాలెట్ లో వేయడం..తన ఓటును అమ్ముకోనని చెప్పడం గమనార్హం. అయితే.. సదరు ఓటరు ఎవరు? ఏంటి? అనే విషయాలు తెలిసినా.. అధికారులు గోప్యంగా ఉంచారు. అంతేకాదు.. ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తర్వాత.. చాలా రోజులకు ఈ విషయం బయటకు రావడం గమనార్హం. మరి లెక్కింపు సమయంలో ఈ విషయం ఎందుకు వెలుగు చూడలేదన్నది కూడా ప్రశ్నగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates