పరిపాలనలో ఒకనేతకు మంచి పేరొచ్చిందంటే అందుకు రెండు కారణాలుంటాయి. మొదటిదేమో సదరు పాలకుడు తెలివిగా సందర్భానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకునే సమర్ధుడై ఉండటం. ఇక రెండో కారణం ఏమిటంటే స్వతహాగా తాను అంత సమర్ధుడు కాకపోయినా మంచి తెలివైన వాళ్ళని సలహాదారులుగా నియమించుకోవటం. ఇప్పుడిదంతా ఎందుకంటే తాజాగా పంచాయితీ ఎన్నికలకు సంబంధించి సుప్రింకోర్టులో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది కాబట్టే.
నిజానికి ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం కోరటంలో తప్పు లేదు. అందుకు చూపించిన కారణంలో తప్పు పట్టాల్సిందీ లేదు. అయినా సుప్రింకోర్టు ప్రభుత్వ వాదనను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఒకవైపు ఎన్నికల నిర్వహణలో నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయాలు అందరికీ స్పష్టంగా తెలుస్తున్నా సుప్రింకోర్టు మాత్రం సమర్ధించింది. పైగా ప్రభుత్వ-నిమ్మగడ్డ వివాదాన్ని సుప్రింకోర్టు ‘ఇగో బ్యాటిల్’ అని అభివర్ణించింది. మరి ఇగో బ్యాటిల్ కు కారణం ఎవరు ? ఎవరి దగ్గర నుండి మొదలైంది.
నిజానికి ఎన్నికల కమీషన్ తో వివాదం పెట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. పంచాయితి ఎన్నికలకు నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇవ్వగానే ప్రభుత్వం నుండి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు మొదలైపోయుంటే ఇప్పుడింతగా గొడవ ఉండేది కాదు. ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీ చేసినాక కోర్టులు కూడా జోక్యం చేసుకోదన్న విషయాన్ని జగన్ కు సలహాదారులు చెప్పలేదా ? సరే ఏదో ప్రత్యేక పరిస్ధితులున్నాయని ప్రభుత్వం అనుకుంటే దాన్ని సమర్ధవంతంగా కోర్టులో ప్రజెంట్ చేయాలి కదా.
హైకోర్టు డివిజన్ బెంచ్ లో వీగిపోయిన కారణాలనే మళ్ళీ సుప్రింకోర్టులో కూడా ఎలా ప్రస్తావిస్తుంది. ఒకే కారణాన్ని పదే పదే చెప్పినందువల్ల ఉపయోగం లేదని సలహాదారులు, అడ్వకేట్ జనరల్ లేదా ముఖుల్ రోహిత్గీ లాంటి వాళ్ళు చెప్పలేదా ? ఎప్పటికిప్పుడు వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని సలహాదారులు చెప్పారో లేదో తెలీదు. ఇంతక ముందు కమీషనర్ కు నిమ్మగడ్డను తీసేసినపుడు కూడా ఇదే సమస్య వచ్చింది. నిమ్మగడ్డను కమీషనర్ గా తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదన్న విషయం జగన్ కు తెలీదా ? ఒకవేళ జగన్ కు తెలీకపోయినా సలహాదారులు చెప్పాలి కదా.
నిమ్మగడ్డతో వివాదం పెట్టుకోవటం వల్ల జగన్ తన స్ధాయిని తానే దిగజార్చుకున్నట్లయ్యింది. కమీషనర్ హోదాలో నిమ్మగడ్డకు రాజ్యాంగబద్దమైన రక్షణ ఉంటుందన్న విషయం జగన్ మరచిపోయినట్లున్నారు. కాబట్టి నిమ్మగడ్డను దెబ్బకొట్టాలంటే రాజ్యాంగాన్ని, చట్టాన్ని కాకుండా తెలివిని ఆయుధంగా చేసుకోవాలన్న విషయాన్ని సలహదారులు చెప్పినట్లు లేదు. ఎందుకంటే జగన్ విషయంలో నిమ్మగడ్డ చేస్తున్న పనిదే. మరి జగన్ కు ఇంతమంది సలహాదారులుండి కూడా ఏమి చేస్తున్నట్లు ? ఇఫ్పటికే అనేక విషయాల్లో కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలినప్పుడైనా జాగ్రత్త పడాలి కదా ?