వైసీపీ బ‌లం త‌గ్గిందా? పెరిగిందా?

గ‌త 2019 ఎన్నిక‌ల‌తో పోల్చుకుంటే.. 2024 నాటికి వైసీపీకి కేవ‌లం 11 స్థానాలు మాత్ర‌మే ద‌క్కాయి. ఆ త‌ర్వాత‌.. జ‌రిగిన తాజా ఎన్నిక‌ల్లో మ‌రింత దారుణ‌మైన ఫ‌లితాల‌నే పార్టీ రాబ‌ట్టింది. కొన్ని స్థానాల్లో గెలిచామ‌న్న సంతృప్తి మిన‌హా.. ఇంత‌కు మించి పార్టీకి ఏమీ ద‌క్క‌లేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. స్థానిక సంస్థల (మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికల ఫలితాల ప్రకారం వైసీపీ బలం భారీగా తగ్గింది. గత 2021 స్థానిక సంస్థల ఎన్నికలతో పోలిస్తే పార్టీ తీవ్రమైన ఎదురుదెబ్బ తింది.

1) మేయర్ పీఠాలు

గత 2021 ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 13 కార్పొరేషన్లనూ వైసీపీ కైవసం చేసుకుంది. కానీ ఈ ఎన్నికల్లో కేవలం అనంతపురం కార్పొరేషన్‌ను మాత్రమే దక్కించుకోగలిగింది. మిగిలిన 12 స్థానాలను టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుచుకుంది.దీంతో కీల‌క‌మైన న‌గ‌ర ఓట‌రు నాడి కూట‌మి వైపు  ఉంద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంది.

2) వార్డుల సంఖ్య

మొత్తం స్థానాల్లో టీడీపీ కూటమి సుమారు మూడింట రెండు వంతుల స్థానాలను గెలుచుకోగా, వైసీపీ చాలా పరిమితమైన వార్డులకే పరిమితమైంది. తుది ఫలితాల ప్రకారం టీడీపీ 2,535 వార్డు స్థానాలను గెలవగా, వైసీపీ కేవలం 539 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇది ఆ పార్టీకి స్థానికంగా ఉన్న ఓటు బ్యాంకును ప్ర‌భావితం చేస్తుంద‌ని అంటున్నారు.

3) కంచుకోట‌ల్లో..

గ‌త 2021, 2024, 2019 ఎన్నిక‌ల‌తో పోల్చుకుంటే వైసీపీకి కంచుకోట‌ల వంటి నెల్లూరు, క‌ర్నూలు, క‌డ‌ప‌, విజ‌య‌న‌గ‌రం వంటి జిల్లాల్లో ప్ర‌స్తుతం వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. ముఖ్యంగా కడప జిల్లాలోని పులివెందుల మున్సిపాలిటీలో సైతం వైసీపీ ఓటమి చవిచూసింది. అక్కడ టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి 13,875 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కడప జిల్లాలోని 279 మున్సిపల్ వార్డులలో వైసీపీ కేవలం 7 స్థానాలనే గెలుచుకోగలిగింది. ఇది పార్టీ దీనావ‌స్థ‌ను సూచిస్తోంద‌ని అంటున్నారు.

4) ప‌రిష‌త్‌లోనూ ప‌డ‌కే!

మున్సిపల్ ఎన్నికల తరహాలోనే తాజాగా విడుదలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లోనూ కూటమి తన జైత్రయాత్రను కొనసాగించింది. ఈ పరిషత్ ఎన్నికల్లోనూ వైసీపీకి పెద్ద ఎత్తున షాక్ తగిలింది. ఒక‌టి రెండు ప‌రిష‌త్‌ల‌ను మాత్ర‌మే సొంతం చేసుకోగా.. రాష్ట్ర వ్యాప్తంగా త్రివ‌ర్ణ ప‌తాకం క‌ప్పుకొన్న‌ట్టుగా కూట‌మి పార్టీలు విజ‌యం ద‌క్కించుకున్నాయి. సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీ బ‌లం పెర‌గ‌క‌పోగా.. మ‌రింత త‌గ్గింద‌ని అంటున్నారు.