పంచాయితి ఎన్నికల ప్రక్రియ వివాదం తారస్ధాయికి చేరుకుంటోంది. ఎలాగైనా ఎన్నికలు జరపాల్సిందే అని స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇదే సమయంలో ఎన్నికల నిర్వహణలో పాల్గొనేది లేదని ఉద్యోగులు తెగేసి చెబుతున్నారు. తమ ప్రాణాలకు రక్షణ లేకుండా ఎలక్షన్ డ్యూటి చేయమని తమను ఒత్తిడి చేసే హక్కు ఎవరికీ లేదని ఉద్యోగసంఘాల నేతలు గట్టిగానే మాట్లాడుతున్నారు.
శనివారం మధ్యాహ్నం నిమ్మగడ్డ ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్సుకు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, పంచాయితి రాజ్ శాఖ ఉన్నతాధికారులు గైర్హాజరవ్వటం సంచలనంగా మారింది. వీళ్ళతో పాటు మరికొన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు+ఇతర అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్సుకు హాజరుకాలేదు. ఈ పరిస్దితుల్లో నిమ్మగడ్డ ఎవరిపైన యాక్షన్ తీసుకుంటారు ? అన్నదే ఇఫుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఎన్నికలకు సహకరించని ఏ ఉద్యోగిపైనా నేరుగా యాక్షన్ తీసుకునే అధికారం నిమ్మగడ్డకు లేదు. ఎవరిపైనా యాక్షన్ తీసుకోవాలన్నా ఆ విషయాన్ని చీఫ్ సెక్రటరీ ద్వారా మాత్రమే చేయించాలి.
అయితే ఇక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన చీఫ్ సెక్రటరీయే నిమ్మగడ్డకు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఎట్టిపరిస్దితిలోను ఏ ఒక్క ఉద్యోగిపైనా కూడా నిమ్మగడ్డ యాక్షన్ కు సిఫారసు చేసినా ఉపయోగం ఉండదు. మహాఅయితే నిమ్మగడ్డ చేయగలిగిందేమంటే గవర్నర్ కు ఫిర్యాదు చేయగలరు. గవర్నర్ అయినా ఏమి చేస్తారు ? మళ్ళీ చీఫ్ సెక్రటరీతోనే మాట్లాడుతారు. ఇది కాదంటే చివరి అస్త్రంగా కోర్టులో కేసు వేస్తారు. కోర్టయినా యాక్షన్ తీసుకోమని ఆదేశించగలదే కానీ రంగంలోకి దిగి తానే నేరుగా యాక్షన్ తీసుకోలేందు కదా.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తన చాంబర్లో కూర్చుని ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్నికలు నిర్వహించితీరుతామని చెప్పటం వరకే నిమ్మగడ్డ చేయగలిగింది. కానీ క్షేత్రస్ధాయిలో ఏర్పాట్లు చేయాలన్నా, ఎన్నికల ప్రక్రియ జరపాలన్నా ప్రభుత్వ యంత్రాంగం పూనుకుంటేనే జరుగుతుంది. ఎలక్షన్ విధుల్లో పాల్గొనాల్సిన రెవిన్యు, మున్సిపల్, పంచాయితీరాజ్ శాఖ, టీచర్లు, పోలీసులు అందరు నిమ్మగడ్డ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కాబట్టి మెజారిటి ఉద్యోగులు ఎలక్షన్ విధులు నిర్వర్తించేది లేదని అడ్డం తిరిగితే నిమ్మగడ్డ ఏమీ చేయలేరు. ఒకవేళ యాక్షన్ తీసుకోవాలని అనుకున్నా ఎన్ని వేలమంది మీద యాక్షన్ కు సిఫారసు చేస్తారు ? దాన్ని ఎవరు అమలుచేయాలి ? కాబట్టి ప్రభుత్వ సహకారం లేకుండా నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరన్నది వాస్తవం. ఉద్యోగులు, ఉన్నతాధికారులు ఎదురుతిరుగుతున్న నేపధ్యంలో నిమ్మగడ్డ ఏమి చేస్తారన్నది ఆసక్తిగా మారింది. చూద్దాం ఏం జరగబోతోందో.