నరేంద్ర మోడీ పేరెత్తితే చాలు శివాలెత్తిపోయే నేతల్లో మమతా బెనర్జీ ఒకరు. ఒకప్పుడు మోడీని వ్యతిరేకించిన నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లాంటి నేతలు తర్వాత స్వరం మార్చేశారు కానీ.. మమత మాత్రం ఎప్పుడూ మోడీ వ్యతిరేకే. కాంగ్రెస్ పార్టీని మంచి మోడీ సర్కారుతో యుద్ధం చేస్తోంది ఈ పశ్చిమ బెంగాల్ సీఎం.
అందులోనూ త్వరలో జరగబోయే బెంగాల్ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ మారడం, రెండు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ సాగుతుండటం.. ఈ నేపథ్యంలో మోడీ మీద మరింతగా మంటెత్తిపోతున్నారు మమత. ఇలాంటి సమయంలో కోల్‌కతాలో జరిగిన సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మమత కూడా హాజరయ్యారు.
ఐతే సరిగ్గా మమత ప్రసంగించాల్సిన సమయానికి సభా ప్రాంగణంలో నినాదాలు మొదలయ్యాయి. ఆశ్చర్యకరంగా జై శ్రీరామ్ నినాదాలు గట్టిగా వినిపించడంతో మమత అవాక్కయ్యారు. తనను కావాలనే లక్ష్యంగా చేసుకుని ఈ నినాదాలు చేస్తున్నారని అర్థమైన మమత.. ఏమాత్రం ఊరుకోలేదు. ఈ వేడుకలకు మోడీ హాజరవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఒక మాట మాట్లాడిన ఆమె.. ఇలాంటి కార్యక్రమాలకు పిలిచి అవమానించడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించింది.
ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం అని, పార్టీలు నిర్వహిస్తున్న రాజకీయ వేడుక కాదని.. ఇలాంటి కార్యక్రమంలో ఈ నినాదాలేంటని ఆమె ప్రశ్నించారు. ఇలా అవమానిస్తున్నపుడు తాను ఏమీ ప్రసంగించబోనంటూ జైహింద్ చెప్పి వెళ్లిపోయారు. ఈ పరిణామానికి మోడీ ఒకింత ఆశ్చర్యచకితుడై చూస్తూ ఉండిపోయారు. దాదాపుగా ఈ సభను వాకౌట్ చేసినట్లుగా ఆమె వ్యవహరించారు. తర్వాత మోడీ మాట్లాడుతున్నపుడు మాత్రం సభికులు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేయడాన్ని బట్టి బీజేపీ వర్గాలు ఉద్దేశపూర్వకంగానే మమతను లక్ష్యంగా చేసుకుని జై శ్రీరామ్ నినాదాలు చేశారని స్పష్టమైంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates