“జగనన్నా ఇది న్యాయమా? నమ్మినోళ్లే మమ్మల్ని ముంచేశారు. నిలువునా ఓడించారు. మాకు మాట మాత్రం కూడా సాయం చేయ లేదు. ఇంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాం. ఎన్నికల్లో పోటీకి అన్నీ అమ్ముకున్నాం. ఇప్పుడు ఓడిపోయాం. ఏం చేస్తావో చెప్పు అన్నా..” అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు లబోదిబో మంటున్నారు. కొందరు నాయకులు తాడేపల్లి కార్యాలయానికి వర్షంలోనూ వచ్చారు. అయితే.. వారిని సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి పంపేశారని తెలిసింది.
దీంతో సోషల్ మీడియాలో ఇప్పటికే ముగ్గురు నాయకులు తమ వాదనను వినిపిస్తూ గగ్గోలు పెట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావుకు చైర్మన్ పోస్టు కేటాయించారు. ఈయనను గెలిపించే బాధ్యతను మాజీ మంత్రి సుభాష్ చంద్రబోస్‌కు అప్పగించారు.దీంతో నాగేశ్వరరావు ఉత్సాహంగా బరిలో నిలిచారు. ఆస్తులు అమ్ముకుని వచ్చిన సొమ్మును ఎన్నికల్లో ఖర్చు పెట్టారట. కానీ.. తీరా సుభాష్ మాత్రం ఎన్నికల వేళ నాగేశ్వరరావుకు పూర్తిగా హ్యాండిచ్చారు. దీంతో ఆయన లబోదిబో మంటున్నారు.
ఇక, గుంటూరు కార్పొరేషన్‌లో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడి భార్య తాడికొండ శ్రీదేవికి అవకాశం ఇచ్చారు. అయితే.. ఆమె కూడా ఈ ఎన్నికల్లో భారీ తేడాతో ఓడిపోయారు. అనంతరం.. ఆమె కూడా కార్యాలయానికి రాగా.. సెక్యూరిటీ సిబ్బంది పంపేశారు. ఆ వెంటనే ఆమె కూడా మీడియా ముందుకు వచ్చారు. ఎన్నికల్లో సొంత పార్టీ నాయకులు(కొందరి పేర్లు చెప్పారు) తమకు హ్యాండిచ్చారని ఆమె వాపోయారు. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు కనీసం తమకు సాయం చేయలేదని పేర్కొన్నారు. పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తులను అమ్ముకుని ఈ ఎన్నికల్లో పోటీ చేయగా ఆ సొమ్ము కూడా పోయిందని జగన్ ఆదుకోవాలని ఆమె కోరారు.
విజయవాడలోనూ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి స్థానిక వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పానని, కానీ.. బలవంతంగా నిలబెట్టారని.. కనీసం ఎన్నికల్లో ప్రచారానికి కూడా మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు వంటి వారు గట్టిగా మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు.పైగా కొందరు ఇతర పార్టీల నాయకులతో కుమ్మక్కయినట్టు తమకు సమాచారం ఉందన్నారు. ఈ విషయాన్ని జగన్ తేల్చాలని రాయన కోరుతున్నారు. ఇలా.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తాడేపల్లికార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates