రంగా వార‌సుడిగా కంటే… రాధాగా ముద్ర వేస్తారా?!

విజ‌య‌వాడ మేయ‌ర్‌గా జ‌న‌సేన నాయ‌కుడు, వంగ‌వీటి రాధాకృష్ణన్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న‌తో పాటు మ‌రో 86 మంది కార్పొరేట‌ర్లు కూడా ప్ర‌మాణం చేశారు. మొత్తంగా ఈ ప్ర‌క్రియ కొన్ని విమ‌ర్శ‌లు, మ‌రికొన్ని వివాదాలు ఉన్న‌ప్ప‌టికీ స‌జావుగానే సాగిపోయింది. ఇక‌, ఇప్పుడు పాల‌న ప్రారంభ‌మైంది. దీనిపైనే అనేక వ్యాఖ్య‌లు.. విశ్లేష‌ణలు కూడా వ‌స్తున్నాయి. `ఇప్ప‌టి వ‌రకు ఒక ఎత్తు.. ఇక నుంచి  విజ‌య‌వాడ ముఖ చిత్రం మ‌రో ఎత్తు` అంటూ రాధా చేసిన వ్యాఖ్య‌లు… చ‌ర్చ‌కు దారి తీశాయి.

న‌గ‌రంలో చేయాల్సిన ప‌నులు చాలానే ఉన్నాయి. రాజ‌ధాని అమ‌రావ‌తికి-విజ‌య‌వాడ‌కు మ‌ధ్య వ్యాపార‌, వాణిజ్య అనుబంధం ఎక్కువ‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లో లావాదేవీలు ఎక్కువ‌గా జ‌రుగుతుండ‌డంతో జ‌నాల రాక కూడా అదే త‌ర‌హాలో ఉంది. దీంతో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు నానాటికీ పెరుగుతున్నాయి. బెంజిస‌ర్కిల్ విస్త‌ర‌ణ అంశం.. కేవలం కాయితాల‌కే ప‌రిమితం అయింది. అలానే.. ఏలూరు రోడ్డులో కొత్త వంతెన నుంచి బ‌స్టాండ్ వ‌ర‌కు మ‌ధ్య‌లో రోడ్డు విస్తరించాల‌న్న ప్ర‌తిపాద‌న కూడా అలానే ఉంది.

ఇక‌, ఫ్లైవోర్ నిర్మాణాలు కూడా ముందుకు సాగ‌డం లేదు. మరోవైపు ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌తో విజ‌యవాడ న‌గ‌ర శివారు ప్రాంతాలు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయి. కానీ, న‌గ‌రం మాత్రం కుంచించుకుపోతోంది. కొత్త‌గా ఎన్నికై, బాధ్య‌త‌లు కూడా చేప‌ట్టిన రాధాపైనే ఇప్పుడు ఇవ‌న్నీ ఆధార‌ప‌డి ఉన్నాయి. వీటిని స‌రిచేయాల్సి ఉంది. ఇక‌, న‌గ‌రంలోని సుమారు 2.3 ల‌క్ష‌ల మందికి ప‌ట్టాలు ఇవ్వాల్సి ఉంది. వీరంతా కొండ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇది కూడా మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలోనే సాగాల్సిన క్ర‌తువు.

మ‌రోవైపు.. రాజ‌కీయంగా రాధాకు అనేక ఎత్తుప‌ల్లాలు ఎదుర‌య్యే అవ‌కాశం కూడా క‌నిపిస్తోంది. మెజారిటీ ప‌రంగా చూస్తే.. విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌లో జ‌న‌సేన‌కు 19 స్థానాలు మాత్ర‌మే ద‌క్కాయి. మ‌రోవైపు.. టీడీపీకి 53 మంది కార్పొరేటర్లు ఉన్నారు. విప‌క్ష స‌భ్యులు త‌క్కువ‌గానే ఉన్నా.. కూట‌మి స‌మ‌న్వ‌యం అత్యంత ముఖ్యం. అలానే తీసుకునే నిర్ణ‌యాలు వేసే అడుగులు కూడా అత్యంత ప్ర‌ధాన‌మ‌నే మాట వినిపిస్తోంది. ఏదేమైనా రంగావార‌సుడిగా రాధా అడుగులు వేసినా.. ఇప్పుడు ఆయ‌న‌కంటూ.. ప్ర‌త్యేక ముద్ర‌ను చూపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని విజ‌య‌వాడ ప్ర‌జ‌లు కోరుతున్నారు.