రాధా పుట్టినరోజుకు మేయర్ పదవి గిఫ్ట్

రాష్ట్రంలో జరిగిన పురపాలక సంఘం ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పూర్తి స్థాయిలో విజయం సాధించింది. అయితే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషన్ ఎంతో ఆసక్తి రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఇక్కడ నుంచి వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా కృష్ణ పోటీకి దిగడంతో పాటుగా కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఐపీస్ అధికారిగా ఏబీ వెంకటేశ్వర రావు పోటీ చేయడంతో విజయవాడ ఎన్నికలపై అంచనాలు పెరిగాయి. ముందుగా ఊహించినట్లుగానే వంగవీటి రాధా కృష్ణ ఘన విజయం సాధించారు.

మంగళవారం వంగవీటి రాధాకృష్ణ పుట్టినరోజు. సరిగ్గా పుట్టినరోజు నాడే ఎన్నికల కౌంటింగ్ జరగడం, మేయర్ గా అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. ఏకంగా 1,30,872 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన మేయర్ గా గెలుపు దక్కింది. విజయవాడ ప్రజలు ఆయన పుట్టినరోజు కానుకగా మేయర్ పదవి ఇచ్చారని చెప్పవచ్చు. మేయర్‌గా ఎన్నికైనట్లు అధికారికంగా ధ్రువీకరణ పత్రం అందుకునేందుకు వంగవీటి రాధాకృష్ణ తన సతీమణితో కలిసి వచ్చారు. పుట్టినరోజు నాడే మేయర్ పదవి దక్కడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ విజయాన్ని విజయవాడ ప్రజలకు అంకితం చేస్తున్నానని వినయంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ విజయం తన బాధ్యతను మరింత పెంచిందని, విజయవాడ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పిన రాధా ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలు, సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. 2004 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీచేసిన ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 22 తర్వాత మళ్ళీ ఇప్పుడు విజయవాడ మేయర్ గా ఘన విజయం సాధించారు.

రాధా తండ్రి వంగవీటి రంగా విజయవాడ కార్పొరేటర్‌గా సేవలందించారు. అక్కడి నుంచే ఆయన రాష్ట్ర నేతగా పేరు తెచ్చుకున్నారు. చరిత్రలో నిలిచిపోయారు. సుమారు రెండు దశాబ్దాల రాజకీయ పోరాటం తర్వాత ఇప్పుడు వంగవీటి రాధా అదే విజయవాడకు మేయర్‌గా బాధ్యతలు చేపట్టడం విశేషం. రాధా కూడా మేయర్ నుంచి మరింత ఉన్నతస్థాయికి ఎదగాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.