అంచనాలు నిజమయ్యాయి. ముందుగా చెప్పినట్లే పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. నాలుగు దశల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన ఆయన.. తొలి దశలో విజయనగరం.. ప్రకాశం జిల్లా మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ముందుకు వెళుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఒకవేళ తమ నిర్ణయానికి భిన్నంగా సుప్రీంకోర్టు నిర్ణయం ఉంటే తప్పకుండా పాటిస్తామన్నారు. రాజ్యాంగం రచించిన అంబేడ్కర్ మానసపుత్రికే ఎన్నికల సంఘంగా అభివర్ణించిన నిమ్మగడ్డ.. ఎన్నికల్ని సకాలంలో నిర్వహించటం కమిషన్ విధిగా పేర్కొన్నారు. ఎన్నికల జాబితా సకాలంలో అందించటంలొ పంచాయితీరాజ్ అధికారులు విఫలమయ్యారని.. విధిలేని పరిస్థితుల్లో 2019 జాబితాలతోనే ఎన్నికల్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.
సకాలంలో ఎన్నికల్ని నిర్వహించటం కమిషన్ విధి అని.. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం నుంచి మిశ్రమ అనుభవాలు ఉన్నాయన్నారు. నిన్న తాను హాజరు కావాలని కోరినా అధికారులు రాలేదన్నారు. ఏకగ్రీవ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తామని.. ఐజీ స్థాయి అధికారులతో ఏకగ్రీవాలను చూస్తామన్నారు. ఎన్నికల సంఘానికి నిధులు.. సిబ్బంది కొరత వంటి సమస్యలు ఉన్నాయని.. ప్రభుత్వానికి చెప్పినా అవేమీ పరిష్కారం కాలేదన్నారు. కోర్టుకు వెళితే.. వారు చెప్పినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదన్నారు.
ప్రభుత్వ ఉదాసీనత గురించి గవర్నర్ కు చెప్పామన్నారు. కమిషన్ లో కొద్దిమందే ఉన్నా.. సమర్థంగా పని చేస్తున్టన్లు చెప్పారు. దేశమంతా ఎన్నికలు జరుగుతున్నా.. ఏపీలో వద్దనటం సరికాదని..ఉద్యోగులు ప్రజాసేవకులన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ ధర్మాన్ని విస్మరిస్తే దుష్పలితాలు ఉంటాయన్నారు. మొదటిదశ ఎన్నికల ప్రక్రియ ఈ రోజు (శనివారం) నుంచే ప్రారంభమై.. ఫిబ్రవరి 5న సర్పంచి.. ఉప సర్పంచి ఎన్నికలతో ముగుస్తుందన్నారు.
పంచాయితీ ఎన్నికల్లో కీలకమైన తేదీలు
జనవరి 23: నోటిఫికేషన్ జారీ
జనవరి 25: అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ
జనవరి 27: నామినేషన్ల దాఖలుకు తుది గడువు
జనవరి 28: నామినేషన్ల పరిశీలన
జనవరి 29: నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
జనవరి 30: అభ్యంతరాలపై తుది నిర్ణయం
జనవరి 31: నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. అనంతరం పోటీలో మిగిలిన వారి జాబితా విడుదల
ఫిబ్రవరి 05: పోలింగ్
సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్. పోలింగ్ పూర్తి అయ్యాక మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. అనంతరం ఉప సర్పంచి ఎన్నిక పూర్తి. మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ముగింపు.