తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం కీలక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. జాతీయస్థాయిలో ‘ఓట్ చోరీ’ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 1న ఢిల్లీలో ‘ఓట్ బచావో’ పేరుతో నిరసన నిర్వహించింది. భారీ బహిరంగ సభ కూడా పెట్టారు. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహా.. మద్దతు ఇస్తున్న పార్టీలకు చెందిన నాయకులను కూడా ఆహ్వానించారు. మొత్తంగా లక్షల మందితో ఈ కార్యక్రమం విజయంవంతం చేశారు.
అయితే.. కార్యక్రమం విజయంవంతం అయిన విషయాన్ని పక్కన పెడితే.. అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు ఈ నిరసనకు రాకుండా డుమ్మా కొట్టడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారాన్ని బీజేపీ ప్రధానంగా విమర్శిస్తుండడం గమనార్హం. కర్ణాటకలో 19 మంది, తెలంగాణలో 13 మంది ఎమ్మెల్యేలు ఈ నిరసనకు రాలేదని.. అంటే.. కాంగ్రెస్ పార్టీపై సొంత నేతలకే విసుగువస్తోందని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంటికింద రాయిగా మారింది.
దీంతో ఏయే రాష్ట్రాల నుంచి ఎవరెవరు రాలేదన్న విషయంపై అధిష్టానం నివేదికలు కోరింది. వారు ఏ కారణాలతో నిరసనకు రాలేదు? అన్న విషయాన్ని తెలుసుకోవాలని.. వారి నుంచి వివరణ తీసుకోవాలని కూడా పార్టీ కోరింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆఘమేఘాలపై ఎమ్మెల్యేల వ్యవహారాన్ని తేల్చేందుకు రెడీ అయింది. ముఖ్యంగా ఈ నిరసనను సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్‌గా తీసుకోవడం, ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో తన టీం నుంచే సభ్యులు డమ్మా కొట్టడాన్ని ఆయన కూడా తీవ్రంగానే భావిస్తున్నారు.
13 మంది ఎమ్మెల్యేలు రాలేదని పక్కాగా నిర్ధారించుకున్నారు. అయితే.. వీరిలో నలుగురు ముందుగానే సమాచారం ఇచ్చారని.. వారి వారి ఇళ్లలో శుభకార్యాలు ఉన్నందున రాలేక పోతున్నట్టు చెప్పారని అంటున్నారు. వీరు మినహా మిగిలిన 9 మంది పరిస్థితిని సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. వారికి సంబందించిన వివరాలతో నివేదికలు రెడీ చేయాలని.. ఢిల్లీకి పంపించాలని సూచించారు. దీంతో పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయంపై నివేదికలు రెడీ చేసినట్టు తెలిసింది. అయితే.. పలువురు ఎమ్మెల్యేలకు.. మంత్రులతో దగ్గర సంబంధాలు ఉండడంతో మంత్రులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ఏం చేస్తారు?
మాట వినని ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యల కింద.. వచ్చే ఎన్నికల్లో సీటును నిరాకరించే అవకాశం ఉంది. అలానే కీలక ప్రాధాన్యం తగ్గించవచ్చు. అలానే.. నామినేటెడ్ పదవుల్లో తమ వారికి అవకాశం ఇవ్వకుండా పక్కన పెట్టొచ్చు. ఇక,ఇంటా బయటా కూడా సహకారం తగ్గుతుందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates