తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు భారీ రాజకీయ సెగ తగులుతోంది. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కనీసం ఏడాది కూడా కాకుండానే.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. తీవ్ర ఇబ్బందిగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం డీఎంకే బలంగా ఉండడం కూడా ముఖ్యమంత్రికి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు రక్షణ కల్పిస్తామన్నారు. కానీ, విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. సుమారు 150కిపైగా మహిళలపై అఘాయిత్యాల కేసులు నమోదు కావడం.. ఓ మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య వంటివి కూడా జరగడం వంటివి ఆయనకు సవాల్‌గా మారింది.
తాజాగా..
తేని జిల్లాలోని తెక్కంపట్టి సబ్ జైలు నుంచి ఏకంగా 17 మంది ఖైదీలు ఒక్కసారిగా పరారు కావడం తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఖైదీల్లో ఒకరికి ఫిట్స్ వచ్చిందని నాటకమాడి, జైలు సిబ్బందిపై దాడి చేసి ఈ ఖైదీలు పారిపోయారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పోర్ట్‌ఫోలియో నేరుగా ముఖ్యమంత్రి విజయ్ పరిధిలోనే ఉండటంతో ప్రతిపక్షాలు ఆయనపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా విజయ్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ జైలు బ్రేక్ ఘటనను ప్రసిద్ధ ఇంగ్లీష్ సిరీస్‌లు ‘బ్రేకింగ్ బ్యాడ్’, ‘ప్రిజన్ బ్రేక్’ లతో పోలుస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసమర్థమైనదని, ప్రజలు తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఇక, విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్‌ను “డమ్మీ సీఎం” అని అభివర్ణించగా, మాజీ సీఎం, అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి ఇటీవల విజయ్ జైళ్లను తనిఖీ చేయడంపై జ్యోతిష్కుల సలహా మేరకే చేశారా అంటూ ఎద్దేవా చేశారు.
మరోవైపు తమిళనాడు బీజేపీ ప్రధాన ప్రతినిధి నారాయణన్ తిరుపాటి స్పందిస్తూ, విజయ్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే ఇంతటి భద్రతా వైఫల్యం చెందడం సిగ్గుచేటని, కేవలం ఫోటో షూట్ తనిఖీలతో లాభం లేదని విమర్శించారు. దీంతో విజయ్ తాజాగా చర్యలకు ఉపక్రమించారు. తేని జిల్లా జైలు సూపరింటెండెంట్‌ను విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అలాగే.. రాష్ట్ర వ్యాప్తంగా జైలు అధికారులను బదిలీ చేయాలని కూడా ఆదేశించారు. తద్వారా రాజకీయ విమర్శలకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates