తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మహారాష్ట్రలో పర్యటించారు. ఈ పర్యటన వెనుక కీలక లక్ష్యం.. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచడమే. తద్వారా తెలంగాణలోని పలు జిల్లాలకు సాగు, తాగునీరు చేరుతుందని సీఎం రేవంత్ భావిస్తున్నారు.. అయితే.. ఈ ఎత్తును పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. గతంలో కేసీఆర్ కూడా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. పైగా ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉండడంతో ఈ సమస్య మరింత సంక్లిష్టంగా మారింది. ప్రస్తుతం నెలకొన్న ఎల్ నినో నేపథ్యంలో రాష్ట్రంలోని మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలు తీవ్ర దుర్భిక్షంలో మునిగిపోయాయి. దీంతో తాజాగా రేవంత్ రెడ్డి మహా సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తొలుత.. తెలంగాణ-మహారాష్ట్రల మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలు.. రాజకీయ సంబంధాలను లేవనెత్తారు. ముఖ్యంగా నిజాం హయాంలో ఉన్న సంబంధాలను కూడా ఆయన వివరించి.. మహారాష్ట్రతో తెలంగాణకు ఎనలేని అనుబంధం ఉందని గుర్తు చేశారు. మహారాష్ట్ర ప్రజలకు-తెలంగాణ ప్రజలకు కూడా కొన్ని సారూప్యతలు కూడా ఉన్నాయన్నారు. ఇలా.. మహారాష్ట్ర సీఎం మనసును ఆకట్టుకున్న రేవంత్ రెడ్డి ఎట్టకేలకు తుమ్మిడి హట్టి ఎత్తు పెంపు విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించారు. ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న మాటను ఆయన నోటితోనే చెప్పించి.. విజయం దక్కించుకున్నారు.
ఇక, ఈ ప్రాజెక్టు ఎత్తు పెంపు వల్ల మహారాష్ట్రకు జరిగే నష్టానికి తామే పరిహారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రాంతాల ప్రజలకు పరిహారంతో పాటు.. పునరావాసానికి అయ్యే నిధులను కూడా అందించనున్నట్టు తెలిపారు. ఇక.. ప్రాజెక్టు ఎత్తు పెంపునకు అయ్యే వ్యయాన్ని కూడా భరిస్తామన్నారు. దీంతో మహారాష్ట్ర సీఎం దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఏంటి ప్రయోజనం?
తుమ్మిడి హట్టి ఎత్తు పెంపుతో ఒనగూరే ప్రయోజనం తెలంగాణకు చాలా ముఖ్యం. అందుకే.. గతంలో కేసీఆర్, ప్రస్తుతం రేవంత్ కూడా ప్రయత్నిస్తున్నారు. ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తును 148 మీటర్ల నుండి 152 మీటర్లకు పెంచాలన్నది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదన. తద్వారా బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచడం వల్ల నది నుండి నీరు సహజసిద్ధమైన గురుత్వాకర్షణ (గ్రావిటీ) ద్వారా కిందికి ప్రవహిస్తుంది. అదే 148 మీటర్ల ఎత్తున నిర్మిస్తే గ్రావిటీ ద్వారా ఆశించిన స్థాయిలో నీరు రాదు.
గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించడం వల్ల భారీ మోటార్లతో నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం తప్పుతుంది. దీనివల్ల పంపింగ్‌కు అయ్యే విద్యుత్ వినియోగం, విద్యుత్ బిల్లులు, ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. గోదావరి నది ఉపనది అయిన ప్రాణహిత నుండి తెలంగాణకు ఉన్న పూర్తి నీటి వాటాను ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరకు గరిష్ట స్థాయిలో తరలించుకోవడానికి వీలవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందుతుంది. వెనుకబడిన, అటవీ, గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని సిర్పూర్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో దాదాపు 2 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు, అలాగే తాగునీరు అందుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates