విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి జనసేన తరపున కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వంగవీటి రాధాకృష్ణ పై వస్తున్న విమర్శలకు టీడీపీ సహా బీజేపీ నాయకులు చెక్ పెట్టారు. జనసేన తరఫున రాధా బరిలో దిగినప్పటికీ.. ఆయనకు టీడీపీ మద్దతు ఇవ్వడం లేదని.. బీజేపీ నాయకులు కూడా దూరంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో అనేక విమర్శలు వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇది చర్చనీయాంశంగా కూడా మారింది. నిన్న మొన్నటి వరకు విజయవాడ కార్పొరేషన్ సీటును టీడీపీ నేత ఒకరు ఆశించడం, ఆయనకు దక్కక పోవడంతో ఈ చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ పరిణామాలు ముదురుతున్న క్రమంలో రాధా విషయంపై టీడీపీ సహా బీజేపీ స్పందించాయి. `రాధా అందరివాడు. ఆయనను ఏకగ్రీవంగా గెలిపించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఆయన ఎంపికను పార్టీలు ఆమోదించాయి“ అని సోమవారం రాత్రి టీడీపీ నుంచి ప్రకటన వచ్చింది. ఇక, బీజేపీ కూడా తాము పూర్తిగా రాధాకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపింది. ఆయన తరఫున ప్రచారం చేసేందుకు త్వరలోనే బృందాన్ని నియమించనున్నట్టు కమల నాథులు తెలిపారు. ఈ క్రమంలో మరో కోణం కూడా తెరమీదికి వచ్చింది. స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు.
ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో విజయవాడలోని కమ్మలందరూ ఆయనకే సపోర్టు చేస్తారని.. దీనికి టీడీపీ నాయకుల మద్దతు కూడా ఉందని మరో ప్రచారం తెరమీదికి వచ్చింది. దీనిని కూడా టీడీపీ ఖండించింది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్ డి ఏ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందరూ చూస్తున్నారు. ఇప్పుడు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ లో కూడా కూటమి అభ్యర్ధినే గెలిపించుకుందాం. కులాల ప్రస్తావన లేని సంక్షేమ రాజ్యాన్ని సాధించుకుందాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు సంయుక్తంగా నిలబెట్టిన వంగవీటి రాధాకృష్ణను తిరుగులేని మెజారిటీతో గెలిపించాలి. అని టీడీపీ పేర్కొంది.
అదే సమయంలో కమ్మ-కాపు అంటూ.. కులతత్వం రెచ్చగొడుతున్న వారికి దీటుగా సమాధానం ఇవ్వాలని టీడీపీ శ్రేణులకు పిలుపుని చ్చింది. కులం పేరుతో ఎవరు ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా కూటమి ఓటు చీలకుండా వంగవీటి రాధాకృష్ణను గెలిపించాలని సూచించింది. విజయవాడ కార్పొరేషన్ ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ విజయం దోహద పడాలని పేర్కొంది. మరోవైపు.. రాధాను టీడీపీ సీనియర్ నాయకులు గద్దె అనురాధ(ఎమ్మెల్యే రామ్మోహన్ సతీమణి), బుద్ధా వెంకన్నలు కలుసుకుని మద్దతు పలికారు. బీజేపీనేతలు కూడా కలుసుకుంటారని ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది. దీంతో రాధా విజయం అలవోకేనన్న వాదనకు బలం చేకూర్చినట్టు అయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates