ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల ఎంపిక వ్యూహాలు పెద్దవే!

ఆరు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం చూసినప్పుడు.. రోటీన్ గా అన్నట్లు కొందరు తీసుకోవచ్చు. కానీ.. ఆరుగురి ఎంపిక.. వారికి కేటాయించిన రాష్ట్రాల్ని చూస్తే.. కచ్ఛితంగా భవిష్యత్తు ఆటకు ఇప్పుడే ప్లేయర్లను సిద్ధం చేసినట్లుగా చెప్పక తప్పదు. రాజకీయ.. సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేసినట్లుగా కనిపించకమానదు. ఈ ఆరుగురి నేపథ్యాన్ని సింగిల్ లైన్ లో చూస్తేనే విషయం కాసింత అర్థమయ్యే పరిస్థితి.

కేరళకు ఎంపిక చేసిన ఓం ప్రకాష్ మాథుర్ సీనియర్ బీజేపీ నాయకుడు మాత్రమే కాదు మాజీ రాజ్యసభ సభ్యుడు. తమిళనాడుకు ఎంపిక చేసిన రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మాజీ బీజేపీ నాయకుడు మాత్రమే కాదు.. గవర్నర్ గా ఎప్పుడు ఎలా వ్యవహరించాలన్న అనుభవం ఎక్కువగా ఉన్న వ్యక్తి. ఒడిశాకు గవర్నర్ గా నియమించిన బ్రజ్ మోహన్ రామ్ విషయనికి వస్తే.. జార్ఖండ్ కు చెందిన బీజేపీ నేత మాత్రమే కాదు ఎస్సీ మోర్చా నేపథ్యం ఉన్న మాజీ ఎంపీ కూడా. కర్ణాటకకు ఎంపిక చేసిన గవర్నర్ విషయాన్ని చూస్తే.. ఆసక్తికర నియామకంగా చెప్పాలి.

డాక్టర్ సుధా యాదవ్ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యురాలిగా వ్యవహరించారు. ఓబీసీ నాయకురాలు. మాజీ బీజేపీ ఎంపీ కూడా. మిగిలిన వారందరిలోనూ వయసులో ఆమె చిన్నవారు. ఉత్తరాఖండ్ గవర్నర్ గా ఎంపిక చేసిన డాక్టర్ ధల్ సింగ్ బిసేన్ మాజీ ఎంపీ మాత్రమే కాదు మధ్యప్రదేశ్ లో బీజేపీ నాయకుడిగా సుపరిచితం. సిక్కింకు ఎంపిక చేసిన దుష్యంత్ గౌతమ మాజీ రాజ్యసభ సభ్యుడు మాత్రమే కాదు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన బ్యాక్ గ్రౌండ్ ఆయన సొంతం.

సిక్కిం గవర్నర్ గా ఉన్న ఓం ప్రకాష్ మాథుర్ ను కేరళంకు పంపగా.. కేరళం రాష్ట్ర గవర్నర్ గా ఉన్న అర్లేకర్ ను తమిళనాడుకు పంపారు. ఇప్పటికే గవర్నర్లుగా పని చేస్తున్న అనుభవం ఉన్న ఇద్దరిని బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు పంపటం కనిపిస్తుంది. తమిళనాడులో అర్లేకర్ ఇప్పటికే గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వత విజయ్ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఆయన వ్యవహరించిన తీరు జాతీయస్థాయిలో చర్చకు రావటం మర్చిపోకూడదు.

ఈ నేపథ్యంలో తమిళనాడుకు కొత్త వారిని తీసుకొచ్చే కన్నా.. ఇప్పటికే ఆ రాష్ట్ర రాజకీయ పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తికే పూర్తి బాధ్యత ఇవ్వటం మంచిదన్న ఆలోచనతోనే తాజా ఎంపిక ఉందన్న మాట చెప్పొచ్చు.

కుల సమీకరణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండే కర్ణాటకలో మాజీ బీజేపీ ఎంపీగా.. ఓబీసీ మోర్చాతో పని చేసిన నాయకురాలిగా.. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ లో పని చేసిన అనుభవంతో పాటు.. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో పని చేసిన అనుభవం ఉన్న అరవై ఏళ్ల వయసున్న సుధా యాదవ్ నియామకం వెనుక వ్యూహాత్మకమని చెబుతున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరిగే రాష్ట్రానికి..కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి ఒక మహిళా గవర్నర్ ను ఎంపిక చేయటం చూస్తే.. భవిష్యత్ అవసరాలకు ముందుస్తు కసరత్తుగా చెప్పొచ్చు.

సరిహద్దు రాష్ట్రాలుగా ఉండే జార్ఖండ్ – ఒడిశాలకు కొత్తగా ఎంపిక చేసిన గవర్నర్ నియామకం ఆసక్తికరంగా మారింది. మూడుసార్లు జార్ఖండ్ నుంచి లోక్ సభకు ఎంపికైన సీనియర్ బీజేపీ నేత.. ఎస్సీ మోర్చాను పని చేసిన అనుభవం ఉన్న ఆయన్ను.. తాను ప్రాతినిధ్యం వహించే రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రంగా ఉన్న ఒడిశాకు ప్రధమ పౌరుడిగా ఎంపిక చేసిన తీరు ఆసక్తికరం. ఉత్తర భారతానికి చెందిన దుష్యంత్ గౌతమ్ ను ఈశాన్య రాష్ట్రానికి గవర్నర్ (సిక్కిం) గా ఎంపిక చేయటం. స్థానిక నాయకుడి ఎంపికకు బదులుగా కేంద్రంలో బలమైన సంస్థాగత అనుబంధం ఉన్న నేతను ఎంపిక చేయటం కనిపిస్తుంది.

తాజా నియామకాల్ని చూస్తే బీజేపీ సంస్థాగత అనుభవంతో పాటు సామాజికంగా వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా ఎంపిక ఉందని చెప్పాలి. రాజకీయంగా సున్నితమైన రాష్ట్రాలుగా ఉన్న కేరళం.. తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాలకు ఓబీసీ.. ఎస్సీ.. మహిళా ప్రాతినిధ్యంతో పాటు బీజేపీ సంస్థాగత అనుభవం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది. తాజాగా గవర్నర్లుగా ఎంపికైన ఆరుగరిలో కేరళ గవర్నర్ వయసు 74 అయితే తమిళనాడు గవర్నర్ వయసు 72.

అదే సమయంలో దక్షిణాదికి చెందిన కర్ణాటక రాష్ట్రానికి గవర్నర్ గా ఎంపికైన సుధా యాదవ్ వయసు 60 ఏళ్లు. ఒడిశా గవర్నర్ వయసు 68 కాగా.. ఉత్తరాఖండ్ గవర్నర్ కు 74, సిక్కిం గవర్నర్ కు 68 ఏళ్లు ఉండటం గమనార్హం. వయసు వారీగా చూస్తే.. దీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్న వారినే కేంద్రం ఆరు రాష్ట్రాల గవర్నర్లుగా ఎంపిక చేసినట్లు కనిపిస్తుంది. పార్టీకి విధేయులున్న ట్యాగ్ కంటే కూడా రాజకీయాల్లో విశేష అనుభవంతో పాటు.. రాజ్యాంగపరమైన పాత్రను పోషించేందుకు తగిన సామర్థ్యం ఉన్న వారిని ఎంపిక చేసినట్లుగా చెప్పొచ్చు.