తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం.. నేరుగా సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇరువురు నేతలు సుదీర్ఘంగా గంట సేపు పలు అంశాలపై చర్చించారు. తమిళనాడు నుంచి తీసుకువచ్చిన పలు కానుకలను విజయ్.. సీఎం చంద్రబాబుకు అందించగా.. బొబ్బిలి వీణ నమూనా కానుకతోపాటు పట్టు వస్త్రాలను సీఎం చంద్రబాబు.. విజయ్‌కు కానుకగా అందించారు. ఈ క్రమంలో ఇరువురు పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా జలాల విషయంలో సహకరించే అంశంపై ముఖ్యమంత్రులు దృష్టి పెట్టారు.
తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి అందుతున్న నీరు పట్ల సీఎం విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఎల్‌నినో వంటి కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉన్నా కూడా.. తమకు నీరు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ సాయాన్ని తాము మరువలేమని ఆయన చెప్పారు. అలానే భవిష్యత్తులోనూ తమకు తాగునీరు అందించాలని.. పేర్కొన్నారు. కాగా.. నదుల అనుసంధానం విషయంపై సీఎం చంద్రబాబు ఆయనతో చర్చించారు. నదులను అనుసంధానం చేయడం ద్వారా.. ప్రతి ఒక్కరికీ తాగు, సాగు నీరు అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా దేశానికి వ్యవసాయ రంగంలో కీలకంగా వ్యవహరిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో ముందుకు రావాలని సూచించారు.
దీనికి తాము సంపూర్ణంగా సహకరించే అంశంపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తమిళనాడు సీఎం విజయ్ తెలిపారు. ప్రస్తుతం ఐటీ సహా.. ఇతర రంగాల్లో వస్తున్న మార్పులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపైనా చర్చించారు. కేంద్రం నుంచి తమకు కూడా సహకారం అందుతోందని విజయ్ తెలిపినట్టు సమాచారం. ఇక, ఇరువురు నేతలు.. వ్యక్తిగత అంశాలపైనా చర్చించుకున్నట్టు తెలిసింది. ఈ పర్యటనలో విజయ్‌తో పాటు పలువురు తమిళనాడు మంత్రులు కూడా విజయవాడకు వచ్చారు. అనంతరం.. విజయవాడ ఉత్సవ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి విజయ్ పాల్గొన్నారు. దసరా ఉత్సవాలకు విజయవాడ వేదిక అని ఆయన కొనియాడారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates