ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్ విధించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ మంత్రివర్గం.. అనంతరం విధివిధానాలను ఖరారు చేసే బాధ్యతను రాష్ట్ర ఎన్నికల సంఘానికి వదిలివేసింది. అయితే.. మంత్రి వర్గ సమావేశం అనంతరం.. చంద్రబాబు సుదీర్ఘంగా మరోసారి మంత్రులతో భేటీ అయ్యారు. వారి పనితీరును ఆయన వివరించారు. ఇది చాలదని.. ఇంకా దూకుడు పెంచాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం రిజల్ట్ చూపించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పూర్తిస్థాయిలో ఈ బాధ్యతలను కూటమి మంత్రులు తీసుకోవాలని కూడా సూచించారు.
నేనొక్కడినే కాదు..
స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపు బాధ్యత కేవలం తను మాత్రమే తీసుకోలేనని చంద్రబాబు చెప్పారు. అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ మాత్రమే తీసుకుంటే సరిపోదని తేల్చి చెప్పారు. ఎన్నికల బాధ్యతలను ప్రతి మంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మీరు ఏం చేస్తారో చేయండి. పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా. కానీ, వంద శాతం అన్ని స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం దక్కించుకోవాలి. ప్రభుత్వం తరఫున అన్ని వ్యవస్థలు సహకరిస్తాయి. మంత్రులుగా మీరు ప్రజలను కలవండి. నాయకులను సమన్వయం చేయండి. అని చంద్రబాబు తెలిపారు.
కొందరు ఇంకా..
మంత్రుల్లో కొందరు ఇంకా యాక్టివేట్ కాలేదని చంద్రబాబు ఆక్షేపించారు. వారి జాబితా కూడా తన వద్ద ఉందని.. పేర్కొన్నారు. కానీ, స్థానిక సంస్థల ఎన్నికలను అందరూ సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. జిల్లాలకు ఇంచార్జ్‌లుగా ఉన్న మంత్రులు.. ఖచ్చితంగా రిజల్ట్ చూపించాలన్నారు. కూటమి తరఫున ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారన్నది కూటమి పార్టీలు నిర్ణయిస్తాయని తెలిపారు. వారిని గెలిపించేందుకు, స్థానికంగా ఉన్న అంశాలను అవగాహన చేసుకుని వాటికి అనుగుణంగా వ్యూహాలు వేసే బాధ్యతను మంత్రులు తీసుకోవాలని తేల్చి చెప్పారు. ఈ విషయంలో అందరూ కలసి కట్టుగా ఉండాలన్నారు. ముఖ్యంగా భేషజాలకు తావులేకుండా ఉండాలన్నారు.
వైసీపీపై పోరు!
వైసీపీ వేసే ఎత్తుగడలను మంత్రులు ముందుగానే తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రతి ఒక్క నిర్ణయానికి కౌంటర్ వేసేలా ఉండాలన్నారు. వైసీపీ చాలా వ్యూహాత్మకంగా రాజకీయాలు చేస్తోందని.. రిజర్వేషన్లను అడ్డుకుందని చెప్పారు. ఈ విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు. అలానే.. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు కూడా వైసీపీ నేతలు హత్యారాజకీయాలు చేసేందుకు వెనుకాడబోరని హెచ్చరించారు. అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ చిన్న విషయమైనా ఉదాసీనంగా వ్యవహరించవద్దని చంద్రబాబు తేల్చిచెప్పారు. అభ్యర్థుల ఎంపిక, పోటీ విషయాల్లో మాత్రం ఎవరూ జోక్యం చేసుకోవద్దని, రచ్చ రాజకీయాలకు తెరదీయవద్దని మంత్రులకు స్వయంగా ఆయన సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates