ప్రస్తుతం విదేశీ విద్యకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఏపీ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి అమెరికా, ఉక్రెయిన్, రష్యా సహా.. అనేక దేశాలకు చదువుకునేందుకు లక్షల సంఖ్యలో విద్యార్థులు పయనమవుతున్నారు. వీరి సంఖ్య రానురాను పెరుగుతోంది. ఇది.. ఆయా దేశాలకు వరంగా కూడామారుతోంది. విదేశీ విద్యార్థుల నుంచి వసూలు చేసే చార్జీలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అయినప్పటికీ.. అక్కడి ఫ్యాకల్టీ, కోర్సులు.. వంటివి విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ సంస్థల్లో చదువుకున్న వారికి వెంటనే భారీ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తుండడం దీనికి ప్రధాన కారణం.
దీనిని గమనించిన ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన విదేశీ సంస్థలను ఏపీకి ఆహ్వానించాలని నిర్ణయించారు. ముఖ్యంగా ప్రపంచ స్థాయిలో క్యూ ఎస్ ర్యాంకింగులో టాప్ 100 స్థానాల్లో ఉన్న సంస్థలను ఏపీకి ఆహ్వానించి ఇక్కడ క్యాపంస్‌లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించనున్నారు. తొలిదశలో 5 విద్యాసంస్థలకు అవకాశం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన కీలక ప్రతిపాదనకు తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఆమోదం లభించింది. అంతేకాదు.. దీనికి సంబంధించి ప్రబుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్న స్థాయి కమిటీని వేయాలని కూడా మంత్రివర్గం తీర్మానించింది.
ఏంటి లాభం?
విదేశీ విద్యాసంస్థలను ఏపీకి తీసుకురావడం వెనుక.. ప్రభుత్వం చాలా దూరదృష్టితో ఆలోచన చేస్తోంది. భవిష్యత్తులో రాజధాని అమరావతి సహా విశాఖ వంటి కీలక నగరాలకు విదేశీ సంస్థలు రానున్నాయి. దీంతో ఆయా సంస్థల్లో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించాలంటే.. విదేశీ విద్యాసంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లకు ప్రాధాన్యం ఉంటుంది. దీనిని అందిపుచ్చుకుని.. ఏపీ యువతకు అవకాశం కల్పించాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. దీంతో ఇక్కడే విదేశీ విద్యను చదువుకునేందుకు అవకాశం కల్పించడం ద్వారా.. ఖర్చు తగ్గడంతోపాటు.. ఆయా విద్యకు కుటుంబాలు పెట్టే ఖర్చు కూడా ఆదా అవుతుంది.
సాధ్యమేనా?
ఇక, ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ విదేశీ విద్యా సంస్థలు లేవు. దీనికి ప్రధాన కారణం.. అసలు ఆ ప్రతిపాదన చేసిన రాష్ట్రమే లేక పోవడం. పైగా.. తమ తమ రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లి చదువుకునే వారికి ప్రోత్సాహకాలు ఇచ్చి వదిలేస్తున్నారు. పైగా.. అక్కడ ఏదైనా జరిగితే లక్షల రూపాయలు ఖర్చు చేసి విద్యార్థులను తిరిగి రప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీలోనే విదేశీ విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఇటు ఏపీ విద్యార్థులకు, అటు దేశంలోని ఇతరరాష్ట్రాల విద్యార్థులకు కూడా మేలు జరుగుతుంది. పైగా.. రాష్ట్రానికి అవసరమైన ఉన్నత స్థాయి చదువులు చదువుకున్న వారుకూడా లభిస్తారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరాల్సి ఉంది. ఈ విషయంపైనా చంద్రబాబు చర్చించారు. కేంద్రంతో మాట్లాడే బాధ్యతలను మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు అప్పగించాలని నిర్ణయించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates