పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతే అంతకంటే అవమానం లేదు

స్థానిక ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూటమి హవా కనిపించింది. మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం అదే ఊపు కొనసాగించింది. చిత్తూరు జిల్లాలో కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే గంగాధర నెల్లూరు లో మాత్రం వైసీపీ గెలిచింది. ఇదిప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే ప్రతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో వైసీపీ గెలుపు జెండా ఎగరేయడంతో ఎమ్మెల్యే థామస్ జీర్ణించుకోలేకపోతున్నారు. అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఆయన ప్రభుత్వ విప్ గా కూడా వ్యవహారిస్తుండటంతో పార్టీకూడా సీరియస్ గానే తీసుకుంది. 

జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమిపై నియోజకవర్గ ముఖ్య నాయకులు, క్రియాశీల కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే థామస్ మాట్లాడుతూ… ఈ ఓటమిని అవమానంగా భావిస్తున్నానని స్పష్టం చేశారు. సహచర ఎమ్మెల్యేలతో మాట్లాడాలంటే గిల్టీగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కొందరు నాయకులు మేము జిల్లా స్థాయి నాయకులమని, మేము స్టేట్ లెవెల్ లీడర్లమని గొప్పలు చెప్పుకుంటూ తీరుతుంటారని, కనీసం సొంత సెగ్మెంట్లో ఎంపీటీసీని గెలిపించుకోలేని మీకు ఆ పదవులెందుకని ప్రశ్నించడంతో సమావేశంలో పాల్గొన్న నాయకులు ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నట్టు సమాచారం. 

ఈ నియోజకవర్గంలో కొంతమంది టీడీపీ నాయకులు వైసీపీతో మిలాఖత్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే టీడీపీ ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే థామస్ కూడా అదే మాట కుండ బద్దలు కొట్టారు.

స్థానిక ఎన్నికల్లో టీడీపీని ఓడించేందుకు కొంతమంది వైసీపీతో చేతులు కలిపారని, వారి జాతకం తన వద్ద వుందని హెచ్చరించారు. పార్టీకోసం పనిచేసే ఉద్దేశం ఉంటేనే మన పార్టీలో ఉండండి, లేదంటే  తెరవెనక మీరు పనిచేస్తున్న వైసీపీ లోకే వెళ్ళిపోండి. అంతేకాని ఇక్కడ పదవులు అనుభవిస్తూ అక్కడ పనిచేయడమంటే కుదరదని స్పష్టం చేశారు. 

ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. పరిషత్ ఎన్నికల్లో గెలుపు సాధించిన వైసీపీ ఊపు లో వుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే థామస్ పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. కనీసం పంచాయతీ ఎన్నికల్లో అయినా గెలుపు కోసం శ్రమించాలని సూచించారు. ఒకవేళ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఓటమి పాలైతే 2029 ఎన్నికల్లో తాను అసెంబ్లీకి పోటీ చేయనని తేల్చి చెప్పేశారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.