అంతా భూమా అఖిలప్రియే చేయించారు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనాన్ని రేపిందో తెలిసిందే. ఇటీవల ఈ కేసుకు సంబంధించి పలువురుని అరెస్టు చేశారు. తాజాగా కిడ్నాప్ కేసులో కీలకంగా వ్యవహరించారని చెబుతున్న నిందితులు సంపత్ కుమార్.. మల్లికార్జున రెడ్డిలను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఈ సందర్భంగా వారు పలు కీలక అంశాల్ని వెల్లడించినట్లుగా చెబుతున్నారు.

రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్టేషన్ కు తీసుకొచ్చి.. కిడ్నాప్ ఉదంతానికి సంబంధించిన పలు ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కిడ్నాప్ ఎపిసోడ్ లో కీలకభూమిక పోషించినట్లుగా వారు చెప్పారని వెల్లడించినట్లు సమాచారం. ఆమె ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి అని.. మిగిలిన విషయాలు తమకు తెలీవన్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా ఈ నిందితుల్ని ఘటనాస్థలాలకు తీసుకెళ్లి.. సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయించనున్నారు. ఏ కారులో తీసుకెళ్లారు? కారును మధ్యలో ఎక్కడైనా ఆపారా? వారితో సంతకాలు చేయించుకునే ముందు బాధితుల్ని ఎలా బెదిరించారు? లాంటి పలు ప్రశ్నల్ని సంధించనున్నారు. కిడ్నాప్ లో ఇతర నిందితుల పాత్రల మీద మరింత క్లారిటీ తెచ్చుకునేందుకు వీరి నుంచి సమాచారాన్ని సేకరించనున్నట్లుగా తెలుస్తోంది. చూస్తుంటే..కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియను పూర్తిగా ఫిక్స్ కానున్నట్లుగా చెబుతున్నారు.