ఏమీ పట్టనట్టువుంటే ఎలా జగన్?

స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు జరగకుండా చూడాలని వైసీపీ ఎత్తులు వేస్తోంది. దీంతో రాష్ట్రంలో లోకల్ ఫైటింగ్ ఆసక్తికరంగా మారింది. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ళ తర్వాత వచ్చిన ఎన్నికలు కాబట్టీ గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పై చేయి సాధించాలని కూటమి నాయకులు పట్టుదలగా వున్నారు. వైసీపీ ఒక్క ప్రధాన స్థానంలో కూడా విజయం సాధించకుండా చూడాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు.

ఈ మేరకు కూటమిలోని టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏ ఒక్క చిన్న అవకాశం కూడా వదిలి పెట్టకుండా జాగ్రతలు తీసుకుంటున్నారు. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో కూడా 100 పర్సంట్ స్ట్రైక్ రేట్ సాధించాలని పకడ్బంధి వ్యూహం అమలు చేస్తోంది. బలం వున్నచోట బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకుంది. అంగబలం, ఆర్ధిక బలం కలిగిన వారికి సీట్లు ఇచ్చి గెలిపించుకుంటే క్షేత్రస్థాయిలో బలోపేతం కావచ్చని ప్లాన్ చేస్తోంది.

టీడీపీ ప్లాన్ మరో విధంగా వుంది. పులివెందులలో వైసీపీని ఓడించి జగన్ ను నైతికంగా దెబ్బ తీయాలని ఆలోచిస్తుంది. పనిలో పనిగా అత్యధిక స్థానాలు సాధించినా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల విజయానికి గట్టి ప్లాట్ ఫార్మ్ ఏర్పాటు చేసుకోడానికి రంగం సిద్ధం చేస్తోంది. దానికి తోడు అధికారం చేతిలో ఉండటం కూటమికి కలిసి వచ్చే అంశం.

వైసీపీ సంగతే ఎవరికీ అర్ధం కావట్లేదు. స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న దానిపై దృష్టి పెట్టడం లేదు. ఎన్నికలను ఎంతకాలం వీలైతే అంత కాలం వాయిదా వేయించేందుకు అవసరమైన పనులన్నీ చేస్తోంది. అంటే ఎన్నికలను ఎదుర్కొనేందుకు వైసీపీ భయపడుతున్నట్లే కదా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతే కాకుండా ఎన్నికల్లో గెలుపు కంటే పోటీ చేయడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్రంలోని అన్నీ స్థానాల్లో పోటీ చేసేందుకు తన శక్తి సామర్ధ్యాలను ఖర్చు చేస్తోంది. కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాకుండా చూడాలని, ఏదైనా నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థులు ఏకగ్రీవం అయితే ఆ నియోజకవర్గం ఇంచార్జికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు ఇచ్చేది లేదని జగన్ స్పష్టం చేశారు.

దానిమీద అనేక విమర్శలు వచ్చాయి. ఆ ఒక్క సమావేశం తప్ప ఆ తర్వాత ఎప్పుడూ స్థానిక ఎన్నికలను జగన్ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదని ఆ పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. ఎన్నికలకు ముందే జగన్ చేతులెత్తేశారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.