ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం కింద.. రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు సర్కారు అవకాశం కల్పించింది. ఇక, ఇప్పటి వరకు 100 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయని తాజాగా ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. తద్వారా మహిళలు కట్టాల్సిన టికెట్ రుసుము ద్వారా వారికి 3500 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక లబ్ధి కలిగిందని వెల్లడించారు.
గత ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పల్లెవెలుగు, డీలక్స్ వంటి బస్సుల్లో మహిళలు తమ ఆధార్ కార్డును చూపించి ఎక్కడ నుంచి ఎక్కడకైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం సగటున రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణాలు చేస్తున్నారు.
ఉద్యోగినులు, దైనందిన అవసరాలు ఉన్నవారు.. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. ఇలా అవసరం ఏదైనా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణాలు చేస్తున్నారు. దీనికిగాను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్టీసీకి సొమ్ములు చెల్లిస్తోంది. ఈ లెక్కన ఏడాదికి 3000 కోట్ల రూపాయలకు పైగానే ప్రభుత్వం స్త్రీ శక్తి పథకానికి వెచ్చిస్తోంది. అయితే.. ఈ సంఖ్య మరింత పెరుగుతుండడంతో ఖర్చు కూడా పెరుగుతోంది. అయినప్పటికీ.. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.. ఖర్చు విషయంలో రాజీపడేది లేదని పేర్కొంటోంది.
జగన్‌కు నిరాస..
2024 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత, కూటమి సారథి చంద్రబాబు.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని.. ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించేలా వెసులుబాటు ఇస్తామని ప్రకటించారు. అయితే.. అప్పట్లోముఖ్యమంత్రిగా ఉన్నజగన్.. ఈ హామీ ప్రకటించడం వరకు మాత్రమే చంద్రబాబు పరిమితం అవుతారని.. దీనిని సాధ్యం చేయలేరని వ్యాఖ్యానించారు. ఇదే అంశాన్ని ఎన్నికల ప్రచారంలోనూ ఆయన చెప్పుకొచ్చారు. కానీ.. ఈ హామీని పట్టుదలగా తీసుకున్న చంద్రబాబు.. గత ఏడాది నుంచి సాకారం చేసి చూపిస్తున్నారు. తాజాగా ఇదిరికార్డు సృష్టించడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates