భార్గవ్ రామ్..ఈపేరు ఇపుడు తెలుగురాష్ట్రాల్లో బాగా పాపులరైపోయింది. మాజీమంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ భర్త. ఓ కిడ్నాప్ కేసులు ఏ 3 నిందితునిగా ఉన్న భార్గవ్ అంటే ఇపుడు ఆళ్ళగడ్డ, నంద్యాలలో జనాలు బాగా మండిపోతున్నారట. కిడ్నాప్ కేసులో అఖిలప్రియతో పాటు మరో 15 మంది అరెస్టయి పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు. అఖిలకు అయితే కోర్టు రెండోసారి కూడా బెయిల్ రెజెక్టు చేసింది. దాంతో చేసేదిలేక మాజీమంత్రి చంచల్ గూడలోని మహిళా జైలులో ఉంటున్నారు.
ఇక కిడ్నాప్ గ్యాంగులోని ఇతర పాత్రదారులు కూడా ఒక్కకొక్కళ్ళుగా పోలీసులకు పట్టుబడుతున్నారు. ఇంతమంది దొరుకుతున్నా భార్గవ్ మాత్రం ఎక్కడా ఆచూకీ దొరకటం లేదు. ఈ పాయింట్ మీదే కర్నూలు జిల్లాలోని భూమా నియోజకవర్గాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందట. కిడ్నాప్ కేసులో భార్య పోలీసులకు దొరికిపోయి జైలులో ఉంటే భర్తయి ఉండి భార్గవ్ పరారీలో ఉండటం ఏమిటంటూ భూమా మద్దతుదారులు మండిపోతున్నారట.
రాయలసీమలో ఫ్యాక్షన్ జిల్లాగా పేరుపొందిన కర్నూలులో భర్తలు ఎవరు కూడా తమ భార్యలను కేసుల్లో ఇరికించి పరారీలో ఉండరని భూమా మద్దతుదారులే కాకుండా మామూలు జనాలు కూడా చెప్పుకుంటున్నారట. కిడ్నాప్ చేశారా లేదా అన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే భార్యకు అండగా ఉండాల్సిన సమయంలో భార్గవ్ తప్పించుకుని తిరగటం ఏమిటంటూ మండిపోతున్నారు. అలాగే అఖిల తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డిని కూడా జనాలు తిట్టుకుంటున్నారట.
కిడ్నాప్ ఘటన వెలుగు చూసిన దగ్గర నుండి అఖిల భర్త భార్గవ్ పరారీలో ఉన్నట్లే తమ్ముడు జగద్విఖ్యాత్ కూడా ఆచూకీ దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. భార్గవ్ మహారాష్ట్రలో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తమ్ముడి ఆచూకీ మాత్రం ఇంతవరకు పోలీసులకు దొరకలేదు. ఇదే సమయంలో తన భర్త, తమ్ముడు ఎక్కడున్నారో కూడా తనకు తెలీదని అఖిల మొదటినుండి చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే.