ఖైరతాబాద్ లో కవిత? చీల్చడానికేనా?

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో కవిత TRS కూడా పోటీ చేయబోతుందన్న ప్రకటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ గుండెకాయ లాంటి ఈ నియోజకవర్గంలో నూతన రాజకీయ వేదికతో అడుగుపెట్టాలని ఆమె వేస్తున్న వ్యూహాత్మక అడుగులు ఏ పార్టీకి లాభం చేకూరుస్తాయి? ఎవరి కొంప ముంచుతాయి? అసలు కవిత ప్లానేంటి..ఝ‌ అన్నదానిపై జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి.

ఈ బైపోల్‌లో సీటు గెలవడం కంటే, క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని చాటడమే కవిత ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి మహిళా ఓటర్ల మధ్య ఆమెకు ఉన్న బలమైన ఇమేజ్, జాగృతి రోజుల నుంచి ఉన్న పరిచయాలు ఈ ఎన్నికల్లో భారీగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. మధ్యతరగతి కాలనీలు, బస్తీల్లో మహిళా సాధికారత నినాదంతో ప్రచారం దూసుకెళ్తే.. ఆ ఓట్లన్నీ కవిత వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది.

అలాగే, అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, తటస్థ ఓటర్లు, సంప్రదాయ ఓటర్లలో చీలక రావాలని కోరుకునే వర్గాలకు కవిత రూపంలో ఒక కొత్త ఆప్షన్ దొరికినట్లవుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును ఆమె ఎంతవరకు చీల్చగలుగుతుందనేది పక్కన పెడితే.. ఈ సరికొత్త ప్రత్యామ్నాయ శక్తి ఉనికి స్థానిక రాజకీయాన్ని పూర్తిగా తమ వైపు తిప్పుకోవడానికి ఆమెకు ఒక చక్కటి మైదానాన్ని అందిస్తుంది.

అయితే కవిత ఎంట్రీతో అత్యధికంగా నష్టపోయేది సిట్టింగ్, ప్రధాన విపక్ష పార్టీలే. ఖైరతాబాద్‌లో సంప్రదాయంగా పాతుకుపోయిన బీఆర్ఎస్ ఓట్లకు ఆమె ఎంట్రీ గండి కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సొంత పార్టీ ఓటు బ్యాంకులోనే చీలిక వస్తే గులాబీ దళానికి ఇది పెను నష్టమే. మరోవైపు, కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో ఉన్న తటస్థ, యువత ఓట్లు కూడా కవిత వైపు మళ్లే ప్రమాదం ఉంది.

ఒకవేళ కవిత గౌరవప్రదమైన ఓట్ల శాతాన్ని దక్కించుకుంటే మాత్రం, ఏ పార్టీ గెలుపు ఓటముల మార్జిన్లనైనా ఆమె శాసించే ‘కింగ్ మేకర్’ స్థాయికి చేరుకుంటారు. ఇది ప్రధాన పార్టీల గెలుపు సమీకరణాలను తలకిందులు చేయడం ఖాయం. మొత్తానికి, ఖైరతాబాద్ పోరులో కవిత ఎంట్రీ అధికార, ప్రతిపక్షాల లెక్కలను పూర్తిగా తల్లకిందులు చేయడం మాత్రం పక్కాగా కనిపిస్తోంది.