టీచర్లు కావాలా… రౌడీ షీటర్లు కావాలా?

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద స్పోర్ట్స్ కోటా టీచర్ల మీద వైసీపీ చేసిన దాడి వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ దాడిలో పాల్గొన్న 20 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద ప్రభుత్వం రౌడీషీట్ ఓపెన్ చేసింది. అదే క్రమంలో ఇవ్వాళ దాడిలో పాల్గొన్న పలువురు రౌడీషీటర్లతో జగన్ కలిసి వున్న ఫోటోలను మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు . వారి పేర్లను సహా పోస్ట్ చేయడంతో వైసీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైంది.

శాప్ కార్యాలయం వద్ద వైసీపీ నిరసనలో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారని ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గుంటూరుకు చెందిన పానుగంటి చైతన్య, బంకా అరుణ్, తాడికొండ సందీప్, విజయవాడ అవుతు శ్రీనివాస రెడ్డి, కంచికచర్ల మార్త శ్రీనివాస్, వెలుపుల రమేష్, తెనాలి గడ్డేటి సురేంద్ర, రేపల్లె అలా రాజ్ పాల్, చిత్రాల ఒబేదు, నందిగామ రాజశేఖర్ లతో జగన్ కలిసివున్న ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేయడంతో వైసీపీ ఇరుకున పడింది. పక్కా ఆధారాలు కనిపిస్తుండటంతో జవాబు చెప్పలేని పరిస్థితి నెలకొంది.

వైసీపీ అధినేత జగన్ రౌడీ షీటర్లకు మద్దతు పలుకుతున్నారని ఆరోపణలు గుప్పించిన లోకేష్ మీరు రౌడీల పక్షమో, టీచర్ల పక్షమో తేల్చి చెప్పాలని కోరారు. నేను మాత్రం టీచర్లు, క్రీడాకారులకు మద్దతు ఇస్తానంటూ స్పష్టం చేశారు. గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బంకా అరుణ్ మాజీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి అనుచరుడు పానుగంటి చైతన్యకు సన్నిహితుడని, అతడి మీద 2025లో పట్టాభిపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదైందని అధికార వర్గాలు చెబుతున్నారు.

ఈ ఆరోపణలను వైసీపీ ఖండించింది. డీఎస్సీ అక్రమాల గురించి ప్రశ్నిస్తే రౌడీలుగా ముద్రలు వేస్తున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైసీపీ నిరసనను టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. అయినా స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు ఒరిజినల్ అని రుజువు చేయాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను స్పోర్ట్స్ కోటా టీచర్ల మీద వేయడం దారుణమని ఎదురుదాడికి దిగింది. ఏది ఏమైనా శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘర్షణ వైసీపీకి నెగిటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టిందనడంలో సందేహం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.