ప్రముఖ కర్ణాటక సంగీత విదుషి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి స్మారక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భావోద్వేగానికి గురయ్యారు. సుబ్బులక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బులక్ష్మి ఐక్యరాజ్యసమితిలో 1966లో ఆలపించిన ‘మైత్రీం భజత’ను మరోసారి ఆలపించడంతో నిర్మలా సీతారామన్ కంటతడి పెట్టారు. సుబ్బులక్ష్మి సంగీతం కేవలం ఒక ప్రదర్శన కాదని.. మెరుగైన ప్రపంచం కోసం చేసిన ప్రార్థన వంటిదని ఆమె పేర్కొన్నారు.
సుబ్బులక్ష్మి సంగీతం ప్రజలకు ఆశ, ఓదార్పును అందించడంతోపాటు ఉమ్మడి మానవత్వ భావనను పెంపొందించిందని నిర్మలా సీతారామన్ అన్నారు. భక్తి భారతీయ శాస్త్రీయ సంగీతానికి జీవనాడి వంటిదని.. వివిధ ఆధ్యాత్మిక సంప్రదాయాలను ఏకం చేసే శక్తి సంగీతానికి ఉందని పేర్కొన్నారు. సుబ్బులక్ష్మి నిరాడంబరత, క్రమశిక్షణ, కఠోర సాధన, సేవాభావాన్ని ఆమె గుర్తుచేశారు.
సుబ్బులక్ష్మి కేవలం సంగీత విద్వాంసురాలు మాత్రమే కాదని.. భారతదేశ సాంస్కృతిక రాయబారిగా ప్రపంచానికి దేశ గొప్పతనాన్ని చాటారని వక్తలు పేర్కొన్నారు. 1966లో ఐక్యరాజ్యసమితి వేదికపై ఆమె ఆలపించిన ‘మైత్రీం భజత’ భారతదేశ శాంతి, సామరస్య సందేశాన్ని ప్రపంచానికి వినిపించిన చిరస్మరణీయ ఘట్టంగా అభివర్ణించారు. ఆమె గానం మతం, ప్రాంతం, భాష వంటి సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా శ్రోతల హృదయాలను తాకిందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates