తిరుమల తిరుపతి పర్యటనకు వెళ్లేవారికి శ్రీవారిని దర్శించుకోవడం.. మొక్కులు చెల్లించుకోవడం.. స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించడం గొప్ప అనుభూతి. శ్రీవారిని ఒక్క నిమిషం పాటైనా దర్శించుకోవాలని సామాన్యులు కలలు కంటారు. అయితే.. అది పెరుగుతున్న భక్తుల ను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుతం కష్టసాధ్యంగానే మారుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వినూత్న ఆలోచన చేశారు. తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉండే మ్యూజియంను త్రీడీ విధానంలోకి ఆధునీకరించారు. ఈ మ్యూజియం ను తాజాగా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సహకారంతో సుమారు 145 కోట్ల వ్యయంతో ఈ త్రీడీ మ్యూజియా న్ని ఆధునీకరించారు.
త్రీడీ మ్యూజియం విశేషాలు ఇవీ..
- మూల మూర్తి అయిన శ్రీవారికి నిత్యం ధరింపజేసే పవిత్రమైన విభిన్న కిరీటాలు, చారిత్రాత్మక దివ్యాభరణాలను త్రీడీ మోడల్ లో ప్రదర్శిస్తారు.
- శ్రీకృష్ణదేవరాయలు సహా ఇతర రాజులు స్వామివారికి సమర్పించిన ఆభరణాల నమూనాలను స్పష్టంగా చూడవచ్చు.
- తిరుమల ఆలయం విశిష్టత.. ఎక్కడ ఏముంది? వంటి అనేక విశేషాలు ఇక్కడ కనిపిస్తాయి.
త్రీడీ మోడల్ ఆఫ్ సెవెన్ హిల్స్ప్రదర్శన ఉంటుంది. - మ్యూజియంలోని మూడో అంతస్తులో ఇమ్మర్సివ్ సాంకేతికతను ఉపయోగించి సృష్టి రహస్యాలు, గ్రహాల గమనం, కాలచక్రం, స్వామివారి విశ్వరూపంను వంటివాటిని చూసి దివ్యానుభూతిని సొంతం చేసుకోవచ్చు.
- శ్రీవారికి పద్మావతీ దేవితో జరిగిన వివాహ వేడుకలను అత్యంత అద్భుతమైన పనోరమిక్ డిస్‌ప్లేపై ఏఐ-జెనరేటెడ్ వీడియో రూపంలో ఉంటుంది.
- 14,000 పైగా కళాఖండాల చరిత్రను భక్తులకు వివరించడానికి హోలోగ్రాఫిక్ స్క్రీన్లు, 360 డిగ్రీల ఇంటరాక్టివ్ డిస్‌ప్లేలు, స్పేషియల్ సౌండ్ సిస్టమ్‌ను అమర్చారు.
అందరికీ ప్రవేశం..
తిరుమల త్రీడీ ఎస్వీ మ్యూజియంను అందరూ దర్శించవచ్చు. ప్రస్తుతానికి ఉచితమే. అయితే.. సమయాల ప్రకారం.. షెడ్యూల్ కేటాయించనున్నారు. బ్యాచ్‌ల వారీగా త్రీడీ మ్యూజియంలోకి అనుమతించనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates