కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విషయంలో జగన్ కేంద్రానికి లేఖ రాసిన వైనం అప్పట్లో సంచలనం రేపింది. ఇక, తమకు న్యాయస్థానాలపై నమ్మకం లేదు అనే రీతిలో వైసీపీ నేతలు గతంలో వ్యవహరించారు. అయితే, అధికారం పోయినా సరే వైసీపీ అధినేత జగన్ తీరు మారినట్లు కనిపించడం లేదు. తాజాగా మరోసారి న్యాయస్థానాలను అవమానించేలా జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

డీఎస్సీ స్కాం అనేది చంద్రబాబు చేసిన స్కాంలలో ఒక ఆణిముత్యంగా నిలిచిపోతుంది అని జగన్ అన్నారు. దీంతో, చంద్రబాబును అరెస్ట్ చేసి నిన్నటికి మూడేళ్లయిందని, అయితే, ఆయనను అరెస్ట్ చేసిన ఒక్క కేసు కూడా నిరూపితం కాలేదని చంద్రబాబు అన్నారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జగన్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. చంద్రబాబు మీద ఉన్న ఆరోపణలు, కేసులన్నీ అధికారులను భయపెట్టి, బెదిరించి ఆయనే కొట్టేయించుకున్నాడనేది జగమెరిగిన సత్యమని జగన్ సెలవిచ్చారు. ప్రతి ఒక్కరికీ ఈ సత్యం అర్థమవుతుందని అన్నారు.

స్టేట్ గవర్నమెంట్ లో ఆయన పైనున్నాడు…అధికారులు కింద ఉన్నారు..డీఎస్సీ కేసు కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు అంటూ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. వీరందరికీ రిపోర్టింగ్ అథారిటీ చంద్రబాబు అని, తనకు తానే క్లీన్ చీట్ ఇచ్చుకునే దౌర్భాగ్యకర పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని జగన్ ఎద్దేవా చేశారు. అయితే, స్కిల్ కేసుతో సహా మిగతా కేసులకు సంబంధించిన తీర్పులిచ్చిన న్యాయమూర్తులను, కోర్టులను అవమానించేలా, అనుమానించేలా జగన్ వ్యాఖ్యలున్నాయని విమర్శలు వస్తున్నాయి. కోర్టులపై జగన్ కు గౌరవం లేదని మరోసారి నిరూపితమైందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.