న‌మ్మ‌కం లేన‌ప్పుడు.. బాబు చేసిన‌ట్టు చేయొచ్చుగా జ‌గ‌న్‌!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌ త‌ర‌చుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల నిర్వహ‌ణ నుంచి పోటీ వ‌ర‌కు ఆయ‌న రోజుకొక రీతిలో వ్యాఖ్య‌లు సంధిస్తున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో అస‌లు ప్ర‌భుత్వంపైనే న‌మ్మ‌కం లేద‌ని.. ఈ స్థానిక ఎన్నిక‌ల‌ను స‌జావుగా సాగ‌నివ్వ‌బోద‌ని.. అందుకే నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. మరికొన్ని సంద‌ర్భాల్లో అస‌లు పోలీసు వ్య‌వ‌స్థ‌పైనే న‌మ్మ‌కం లేద‌ని ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఏకంగా కేంద్ర బ‌ల‌గాల ప‌హారాలో స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు.

ఇక‌, కొన్ని సంద‌ర్భాల్లో.. అస‌లు నామినేష‌న్లు వేయ‌కుండా కూడా అడ్డుకునే అవ‌కాశం ఉంద‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. అయినా .. పోరాడైనా కూడా నామినేషన్లు వేయాలని చెబుతున్నారు. ఇక‌, మ‌రికొన్ని సంద‌ర్భాల్లో మ‌న‌కు అస‌లు పోటీ చేసేందుకు అభ్య‌ర్థులు త‌క్కువ‌గా ఉన్నార‌ని.. అవ‌స‌రం అయితే.. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జ్‌లుగా ఉన్న‌వారు త‌మ త‌మ కుటుంబ స‌భ్యుల‌నైనా రంగంలోకి దింపాల‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. ఒక‌ర‌కంగా.. చెప్పాలంటే ఇవ‌న్నీ వైసీపీని స్థానిక ఎన్నిక‌ల్లో తీవ్ర గంద‌ర‌గోళానికి గురి చేస్తున్న ప‌రిణామాలే. అధినేత ఏం చెప్పినా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

ఇలాంటి సంద‌ర్భ‌మే..

వాస్త‌వానికి ఇలాంటి సంద‌ర్భ‌మే 2021లో అంటే.. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. టీడీపీకి కూడా ఎదురైంది. అప్ప‌ట్లో చంద్ర‌బాబు కూడా ఇవే సందేహాలు వ్య‌క్తం చేశారు. దీనికి కార‌ణం.. వైసీపీ నాయ‌కుల దాడులు, టీడీపీ నేత‌ల‌పై పెట్టిన కేసులు.. స్థానికంగా దౌర్జ‌న్యాలు వంటివి క‌నిపించాయి. ఇప్పుడు అంత‌లేక‌పోయినా.. వైసీపీ అధినేత మాత్రం డౌట్ వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబు సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. అస‌లు స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీ చేయ‌ద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. నిజానికి క్షేత్ర‌స్థాయిలో బ‌లం ఉన్నా.. వైసీపీ ఆగ‌డాల‌కు కార్య‌క‌ర్త‌లు ఎక్క‌డ బలి అవుతారోన‌ని చంద్ర‌బాబు వెనుక‌డుగు వేశారు.

అప్ప‌ట్లోనూ టీడీపీ నాయ‌కులు కొంత మేర‌కు సాహ‌సం చేశారు. అధినేత వ‌ద్ద‌న్నా.. కొన్ని ప్రాంతాల్లో పోటీ చేశారు. విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఎప్పుడూ లేని విధంగా చంద్ర‌బాబు మాత్రం స్థానిక స‌మరం మ‌న‌కు వ‌ద్ద‌ని తేల్చేశారు. మ‌రి ఇప్పుడు అన్ని డౌట్లు పెట్టుకుని జ‌గ‌న్ మాత్రం ఎందుకు పోటీకి దిగుతున్న‌ట్టు..? అనేది ప్ర‌శ్న‌. ప్ర‌భుత్వంతో గొడ‌వ ప‌డి.. లేనిపోని శాంతి భ‌ద్ర‌తల స‌మ‌స్య‌లు సృష్టించి.. ఏదో ఒక‌ర‌కంగా.. యాగీ చేయాల‌న్న ఉద్దేశ‌మే ఉండి ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. అంత ప‌రిస్థితి లేన‌ప్పుడు.. పోటీకి అభ్య‌ర్థులే క‌రువైన‌ప్పుడు.. హుందాగా పోటీ నుంచి త‌ప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తే బాగుంటుంద‌ని వైసీపీ నాయ‌కులే గుస‌గుస‌లాడుతున్నారు.