కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ బీజేపీ ఐటీ సెల్ బ్యాచ్ విపరీతంగా ట్రోల్ చేసేది. రాహుల్ గాంధీ చెప్పే విషయాలు ఆ ట్రోలింగ్ ధాటికి కొట్టుకుపోయేవి. అయితే, కోవిడ్ గురించి ముందే రాహుల్ వార్న్ చేసినా సరే కేంద్రం లైట్ తీసుకుంది. ఆ తర్వాత కోవిడ్ వల్ల ప్రజలు నానా అగచాట్లు పడుతున్న సమయంలో రాహుల్ గాంధీ గతంలో హెచ్చరించిన వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత కూడా దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, జీడీపీ గురించి రా.గా చాలాసార్లు హెచ్చరించారు.
అయినా సరే ఎప్పటి లాగే ఓ వర్గం మీడియా, సోషల్ మీడియా రాహుల్ వ్యాఖ్యలను లైట్ తీసుకునేలా ట్రోల్స్ చేసింది. అయితే, ఇప్పుడు రాహుల్ చెప్పిన విషయాన్ని బీజేపీ కీలక నేత, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా చెప్పారు. దీంతో, రాహుల్ గాంధీ విజన్ పై సోషల్ మీడియాలో కాంగ్రెస్ అనుకూల వ్యక్తులు, లిబరల్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
దేశంలో భారీ ఆర్థిక, ఆహార సంక్షోభం రాబోతోందని 2026 మే, జూన్ నెలల్లో రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చారు. భారత దేశంలో మునుపెన్నడూ చూడని ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభాన్ని ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలను రక్షించే షాక్ అబ్జార్బర్స్ వంటి వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం తొలగించిందని, అందువల్లే ఈ పరిస్థితి రాబోతోందని విమర్శించారు.
అయితే, ఆ ప్రభావం అదానీ, అంబానీలకు తగలదని, యువత, రైతులు, కార్మికులు, సామాన్యులు, చిరు వ్యాపారులపై మాత్రమే ఉంటుందని చెప్పారు.
కట్ చేస్తే తాజాగా జై శంకర్ కూడా ఈ విషయంపై హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆహార, ఆర్థిక సంక్షోభం రాబోతోందని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన హెచ్చరించారు. అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయంగా పలు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ సంక్షోభాలు వస్తాయని జోస్యం చెప్పారు. దీంతో, రాహుల్ గాంధీ చేసిన పాత వ్యాఖ్యలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ఇప్పటికైనా బీజేపీ నేతలు కళ్లు తెరవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
