స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా విరుచుకొని పడ్డారు. పార్లమెంట్ పై దాడికి పాల్పడిన వాళ్ళు , పుల్వామాలో సైనికుల మీద దాడి చేసిన తీవ్రవాదులు , స్పీకర్ ను దూషించిన వాళ్ళు ఒక్కటేనంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీ తొలిరోజు బీఆర్ఎస్ కు పోలీసులకు మధ్య జరిగిన ఘటనలు, తదుపరి పరిణామాల సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆ ఘటనపై విచారణకు ఆదేశించారు.
ఎర్రపల్లి గొడవల తర్వాత బీఆర్ఎస్ నాయకులు శుద్ది కార్యక్రమం నిర్వహించడాన్ని తప్పు పట్టారు. దళితులను బీఆర్ఎస్ అవమానించిందని, కెసిఆర్ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ ఫాం హౌస్ లోనే కుట్ర జరిగిందని, ఉసికొల్పబడినందువల్లే కొందరు సభ్యులు అధికారుల మీద దాడులు చేయడమే కాకుండా స్పీకర్ ను అవమానించారని, ఆయన తల్లిని కూడా అవమానించడం దారుణమన్నారు.
అసెంబ్లీలో అర్ధవంతమైన చర్చలు జరిగితే ప్రజలు బీఆర్ఎస్ కు బొంద పెడతారని, కనుక ఉద్దేశ్యపూర్వకంగా గొడవలు సృష్టించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. దళితులు నడిచిన నేలను శుద్ది చేయడం కాదు అంటరానితనాన్ని నీళ్లతో శుద్ధి చేయాలో, యాసిడ్ తో శుద్ది చేయాలో చెప్పాలని ప్రశ్నించారు. దళితులు పంట పొలాల్లో పనిచేస్తే మన కడుపులు నిండుతున్నాయని చెప్పిన సీఎం శుద్ది చేయాల్సింది నేలను కాదు కెసిఆర్లో నరనరాన పేరుకు పోయిన దొరతనాన్ని శుద్ది చేయాలన్నారు.
ఫాం హౌస్ లో జరిగిన కుట్ర గుట్టును రట్టు చేయడానికి డప్పు దరువులతో ప్రజా స్వామ్య పద్దతిలో నిరసన తెలిపితే దళితులు తిరిగిన నేలను శుద్ది చేస్తారా…? రాతి యుగంలోని రాక్షసుల్లా వ్యవహారిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో మనువాదం ప్రబలిపోతుందని, నిన్న కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను శుద్ది చేశారని, ఇప్పుడు కెసిఆర్ ఫాం హౌస్ వద్ద దళితులు తిరిగిన నేలను శుద్ధి చేశారని, ఇది క్షమించరాని విషయం అన్నారు. ఈ ఘటనలో చట్టాలను అడ్డుపెట్టుకొని బెయిల్ తీసుకోవచ్చు కానీ తెలంగాణా ప్రజలు మాత్రం బెయిల్ ఇవ్వరని తేల్చి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates