చిరు vs ఎన్టీఆర్ ఫాన్స్ వార్లు… సహించని హై కమాండ్లు

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న కూటమి పార్టీల్లో కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకుల మధ్య సోషల్ వార్ జరుగుతుంది. టీడీపీ మంత్రుల శాఖల పనితీరును విమర్శిస్తూ జనసేన కార్యకర్తలు విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దానికి ప్రతిగా జనసేన మంత్రుల పనితీరు మీద టీడీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు. మొగల్తూరు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ జనసేన ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత ఇది మరింత ఊపందుకుంది. తొలుత రాజకీయ విమర్శల నుంచి ప్రారంభమైన ఈ సోషల్ వార్ చినికి చినికి గాలివానగా మారినట్లు వ్యక్తిగత విమర్శల వరకు వెళ్ళింది.

టీడీపీ కార్యకర్తలు చిరంజీవిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడం, జనసేన కార్యకర్తలు టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మీద బురదజల్లడంతో పరిస్థితి చేయి దాటింది. ఇరు పార్టీల కార్యకర్తలు హద్దులు మీరి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల మీద తీవ్రమైన విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టారు. అంతటితో అయినా ఆగారా అంటే అదీలేదు.. అధినాయకుల కుటుంబ సభ్యులను ఉద్దేశించి అసభ్యకర, అశ్లీల దూషణలు చేసుకునే స్థితికి దిగజారారు.

నిన్నా మొన్నటి వరకు డీఎస్సీ అక్రమాలపై వైసీపీ చేసిన విమర్శలను కూటమి నాయకులు విజయవంతంగా తిప్పికొట్టారు. ఇప్పుడు తాజాగా మీడియాలో వస్తున్న కథనాలతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. సరిగ్గా ఈ సమయంలో జనసేన కార్యకర్తలు కూడా
డీఎస్సీ అక్రమాల గురించి ఆరోపణలు సంధించడం టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు. తెరవెనక వైసీపీతో చేతులు కలిపి మంత్రి లోకేష్ ను టార్గెట్ చేసినట్లు తమ్ముళ్లు అనుమానిస్తున్నారు.

ఎన్టీఆర్, చంద్రబాబును కూడా వదిలిపెట్టకుండా జనసైనికులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల మీద కామెంట్స్ చేస్తూ టీడీపీ శ్రేణులు పెట్టిన పోస్టులు జనసేన అధినేత దాకా చేరింది. దీంతో కూటమి పార్టీలు అప్రమత్తం అయ్యాయి.

స్థానిక ఎన్నికలకు సిద్ధం అవుతున్న కీలక సమయంలో మీడియాలో డీఎస్సీ అక్రమాల కథనాల రగడ మొదలు కావడం, ఇదే కీలక సమయంలో కూటమి ఐక్యతను దెబ్బతీస్తూ సోషల్ వార్ జరగడం వెనక ఏదో కుట్ర జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమానిస్తున్నారు. కూటమి కలిసి వుంటే వైసీపీకి లోకల్ ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదు. ఈ విషయాన్ని జనసేన హై కమాండ్ అర్ధమయ్యేలా చెప్పారు. కూటమి మధ్య ఐక్యతను దెబ్బతీసే చర్యలను కట్టడి చేసేందుకు రంగంలోకి దిగారు.

టీడీపీ, జనసేన పార్టీలు తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ కార్యకర్తలు జనసేన అధినేతలను, జనసేన కార్యకర్తలు టీడీపీ సుప్రీం లీడర్లను విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఇరు పార్టీలు కేడర్ కు హెచ్చరికలు జారీ చేశారు. కూటమి ఐక్యతను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

ప్రభుత్వ పనితీరు, మంత్రుల శాఖల మీద ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడ్డం మంచిది కాదని తేల్చి చెప్పారు. సీఎం చంద్రబాబు మీద విమర్శలు చేసిన జనసేన కార్యకర్తల మీద ఆ పార్టీ చర్యలు తీసుకుంటుందని టీడీపీ ప్రకటనలో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఎవరూ హద్దులు దాటొద్దని జనసేన సూచించింది. అధినేతల హెచ్చరికలు ఏమాత్రం పనిచేస్తాయో చూడాలి..