అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి డుమ్మా కొడుతోన్న సంగతి తెలిసిందే. అంబటికి ఈడీ రెండోసారి నోటీసులు జారీ చేసినా ఆయన మాత్రం విచారణకు హాజరు కాకుండా కుంటి సాకులు చెబుతున్నారు. గతంలో కేటాయించిన విచారణ తేదీకి బదులుగా కొత్త తేదీ ఇవ్వాలని అంబటి కోరారు. దీంతో, ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులిచ్చింది. కానీ, ఆ తేదీకి కూడా ఆయన విచారణకు రాకుండా డుమ్మా కొట్టారు.

అయితే, ఈ స్కాంలో తనకు 90 ఎంఎల్ వినియోగదారుగా మాత్రమే పాత్ర ఉందని, మరెలాంటి పాత్ర లేదని అంబటి అంటున్నారు. పోనీ అదే విషయం విచారణకు వచ్చి చెప్పొచ్చు కదా అంటే మాత్రం రానంటున్నారు. తప్పు చేయని అంబటికి భయమెందుకు అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే, తనకు గుండెలో రెండు స్టెంట్లున్నాయని మెడికల్ రిపోర్టులు పంపి విచారణకు హాజరు కావడం లేదు. అంత సున్నితంగా తనకు అనారోగ్యంగా ఉంది అని చెప్పిన అంబటి రాజకీయాలు మాత్రం యాక్టివ్ గా చేస్తున్న వైనంపై విమర్శలు వస్తున్నాయి.

ప్రెస్ మీట్లు పెట్టడం, అధికార పార్టీ నేతలకు ఛాలెంజ్‌లు విసరడం….డీఎస్సీ ధర్నాల్లో కూడా పాల్గొనడం వంటివి చేస్తున్నప్పుడు ఆయనకు అనారోగ్యం గుర్తుకు రావడం లేదా? ఈడీ విచారణ అంటేనే అంబటికి అనారోగ్యం గుర్తొస్తుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

జగన్ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్టులు, సబ్‌కాంట్రాక్టుల కేటాయింపుల లావాదేవీలపై ఈడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేసే రవాణా వ్యవస్థలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. వాటిపై కేసు నమోదు కాగా…అందులో అంబటి పేరు కూడా ఉంది.