ఇలాగైతే లోకేష్ ను వైసీపీ ఓడించినట్టే

రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సొంత నియోజకవర్గం కావడంతో దీనికి ఎనలేని ప్రాముఖ్యత లభిస్తుంది. మంత్రి లోకేష్ ను టార్గెట్ చేసిన వైసీపీ మంగళగిరి నియోజకవర్గంపై కన్నేసింది. ఇక్కడ ఎలాగైనా సరే లోకేష్ ను ఓడించడం ద్వారా టీడీపీని కోలుకోలేని దెబ్బ తీయాలని కలలు కంటుంది. ఓడించడం సంగతి తర్వాత చూసుకోవచ్చు కానీ ముందు ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థిని నియమిస్తే చాలని ఆ పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు.

2024 ఎన్నికల సమయంలోనే లోకేష్ ను ఓడించేందుకు వైసీపీ అనేక ప్రయత్నాలు చేసింది. టీడీపీ లో మంచి గుడ్ విల్ వున్న గంజి చిరంజీవిని వైసీపీలో చేర్పించింది. ఎన్నికలు రోజుల వ్యవధి ఉందనగా సీనియర్ నాయకుడు మురుగుడు హనుమంతరావు కోడలు లావణ్యను తెరమీదకు తెచ్చింది. ఆమె ఆ ఎన్నికల్లో ఏ స్థాయిలోనూ పోటీ ఇవ్వలేక పోయింది. ఎన్నికల ఫలితాలు దాన్ని రుజువు చేశాయి. లోకేష్ గెలిచి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడమే కాదు అతి తక్కువ కాలంలో మంగళగిరి నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్నారు.

మరోవైపు వైసీపీ ఈ రెండేళ్లలో ఇంకా కోలుకోలేదు. మంగళగిరి నియోజకవర్గంలో కంటిన్యూగా ఒక ఇంచార్జిని నియమించుకోలేక ఆపసోపాలు పడుతోంది. ఈ రెండేళ్లలో వైసీపీ ఇంచార్జిలు తరచుగా మారుతున్నారు. ఇవ్వాళ వున్న ఇంచార్జి రేపు ఉంటాడో లేదో స్థానిక నాయకులు, కార్యకర్తలు చెప్పలేని దుస్థితి నెలకొంది.

గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మురుగుడు లావణ్య అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారు. దాంతో మంగళగిరి వైసీపీ వ్యవహారాలను దొంతిరెడ్డి వేమారెడ్డి చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఆయనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కొత్త ఇంచార్జిని నియమించారు. బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డికి మంగళగిరి బాధ్యతలు కేటాయించారు. దీంతో వేమా రెడ్డి వర్గం భగ్గు మంటోంది.

అదేం చిత్రమో కానీ మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ కు వ్యతిరేకంగా వైసీపీ తరుపున పోటీ చేసిన అభ్యర్థులు, ఇంచార్జిలు ఆ తర్వాత కనుమరుగవుతున్నారు. టీడీపీ లో ఒక వెలుగు వెలిగిన గంజి చిరంజీవి వైసీపీలో చేరి ఇప్పుడు అదృశ్యమయ్యారు. లోకేష్ మీద గెలిచి రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్శించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇప్పుడు తెరమరుగయ్యారు. లోకేష్ మీద పోటీ చేసి ఓడిన మురుగుడు లావణ్య సైలెంట్ అయిపోయారు. వేమా రెడ్డి కూడా ఏదొక దారి చూసుకునే పరిస్థితి వైసీపీ అధిష్టానం కలిగించింది. దీంతో లోకేష్ ను ఓడించే నాయకుడు లేడా అని వైసీపీ అధినేత జగన్ తలపట్టుకుంటున్నాడని ఆ పార్టీలో వినిపిస్తుంది.