ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల చేయ‌నుంది. దానంనాగేంద‌ర్‌పై వేటు ప‌డిన నేప‌థ్యంలో ఈ నియోజ క‌వ‌ర్గం ఖాళీ అయిన‌ట్టుగా అసెంబ్లీ స‌చివాల‌యం గెజిట్ జారీ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఖైర‌తాబాద్‌లో పాగా వేసేందుకు పార్టీలు రెడీ అవుతున్నాయి. బీజేపీ ఈ విష‌యంలో నాలుగు అడుగులు ముందే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఇప్ప‌టికే బీజేపీ త‌ర‌ఫున పోటీ చేసే అభ్య‌ర్థిని ఇక్క‌డ ఖ‌రారు చేశార‌న్న చ‌ర్చ‌జ‌రుగుతోంది. మాజీ ఎమ్మెల్యే, బీజేపీకి బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న చింత‌ల రామ‌చంద్రారెడ్డిని క‌మలం పార్టీ దాదాపు ఖ‌రారు చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలాన్ని పుణికి పుచ్చుకున్న చింత‌ల.. ప్ర‌స్తుతం ఉన్న బీజేపీ నాయ‌కుల్లో సీనియ‌ర్ నేత కావ‌డం.. పైగా వివాదాల‌కు దూరంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో భాగ్య‌న‌గ‌రంలో బీజేపీని బ‌లోపేతం చేసే నాయ‌కుడిగా కూడా ఆయ‌న గుర్తింపు తెచ్చుకున్నారు.

వీటికితోడు.. మాజీ ఎమ్మెల్యేగా ఆయ‌న ఖైర‌తాబాద్‌లో బ‌ల‌మైన ముద్ర వేశారు. అండ‌ర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప‌నుల‌కు గ‌తంలో శ్రీకారం చుట్టిన నాయకుడిగా కూడా చింత‌ల‌కు పేరుంది. చింత‌ల్ బ‌స్తీ నుంచి మ‌క్తా వ‌ర‌కు కూడా ఆయ‌న అభివృద్ధి ప‌నులు చేయ‌డంలోనూ.. మాస్ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డంలోనూ ముందున్నారు. అంతేకాదు.. ఆయ‌న సాధార‌ణ వ్య‌క్తిగా అంద‌రితోనూ క‌లిసిపోతుంటారు. ఎలాంటి ఇగోలు.. లేకుండా.. సాధార‌ణ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై అనేక సార్లు నిర‌స‌న‌లు కూడా తెలిపారు.

ఇక‌, బీజేపీ చింత‌ల‌ను ఎంపిక చేసేందుకు ప్ర‌ధాన కార‌ణం.. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ప‌ట్టుత‌ప్ప‌కుండా.. పార్టీని డెవ‌ల‌ప్ చేయ‌డ‌మే. ప్ర‌స్తుతం దానం అనర్హ‌త పిటిష‌న్ విష‌యంలోనూ చింతల కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వ‌రకు న్యాయ పోరాటం చేయడం చింత‌ల‌కు బీజేపీలో మంచి మార్కులు ప‌డేలా చేసింది. పైగా.. గ‌తంలో ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో బీఆర్ ఎస్‌(అప్ప‌టి టీఆర్ ఎస్‌) నుంచి ఆఫ‌ర్ వ‌చ్చినా.. పార్టీలో అంకిత భావంతో ఉన్నారు. కాగా.. ప్ర‌స్తుతానికి పేరు ప్ర‌క‌టించ‌క‌పోయినా.. చింత‌ల‌ను బీజేపీ ఖ‌రారు చేయ‌నుంద‌ని తెలుస్తోంది.