మరో పది రోజుల్లో దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. వివిధ రూపాల్లో గణ పతి విగ్రహాలను ఏర్పాటు చేసి మొక్కడం.. పూజలు చేయడం, ఆడిపాడి ఆనందించడం.. ఇవన్నీ.. మన కు కనిపిస్తాయి. అయితే.. ఇతర విగ్రహాలకు.. గణపతి విగ్రహాలకు తేడా ఉంది. వినాయక విగ్రహాలను మనం కావాలనుకున్న రూపంలో తీర్చిదిద్దుకునే స్వేచ్ఛ ఉంది. అదే అయ్యప్పో.. కుమారస్వామో అయితే.. అలా చేసేందుకు అవకాశం లేదు.
దీంతో గణపతి నవరాత్రుల్లో వివిధ రూపాల్లో ఉన్న గణపతులకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటోంది. తాజా గా ఈ విషయాన్ని ఒంటబట్టించుకున్న తెలంగాణలోని సూర్యాపేట పోలీసులు.. `సైబర్ గణపతి` పేరుతో పోస్టర్లను ముద్రించారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలను నియంత్రించడం.. చాలా సంక్లిష్టంగా మారుతోంది. పెద్ద పెద్ద ఐపీఎస్ అదికారులు కూడా ఈ మోసాల బారిన పడి కోట్లు పోగోట్లుకుంటున్న పరి స్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సైబర్ మోసాల్లో చిక్కుకోకుండా.. అప్రమత్తతే ముఖ్యమని పోలీసులు చెబుతున్నారు.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని సైబర్ గణపతి పేరుతో పెద్ద పెద్ద పోస్టర్లను ముద్రించారు. వీటిని అన్ని వినాయక మండపాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు. తద్వారా.. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్నయించారు. ఈ ప్రయత్నం వినూత్నంగా ఉండడం.. ఆకర్షణీయంగా కూడా ఉండడంతో సూర్యాపేట పోలీసులకు ప్రజల నుంచి ప్రసంశలు దక్కుతున్నాయి.
ఇలా ప్రచారం..
గణపతి ఆకారంలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. చెవులు, తొండం.. బొజ్జ.. ఆయనకు సమర్పించే ఉండ్రాళ్లు.. వాహనం ఇలా ప్రతిదీ ప్రత్యేకమే!. వాటినే ఆలంబనగా చేసుకుని సూర్యాపేట పోలీసులు.. ఒక్కొక్క భాగాన్నీ సైబర్ మోసాలకు.. లింకు పెట్టి వివరించిన తీరు అద్భుతంగా ఉంది. వాటి ద్వారా సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కలుగుతుందని భావిస్తున్నారు.
ఇలా అవగాహన..
గణపతి చెవులు: అనుమానాస్పద ఫోన్‌కాల్స్, మెసేజ్‌లను జాగ్రత్తగా విని, అర్థం చేసుకున్నాకే స్పందించాలనే సందేశం.
కళ్లు: గణపతి బొజ్జ పెద్దది కానీ, కళ్లు మాత్రం చిన్నవిగా ఉంటాయి. వీటిని పేర్కొంటూ.. ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతి విషయాన్ని వెంటనే నమ్మకుండా.. నిశితంగా పరిశీలించాలనే సందేశం ఇస్తున్నారు.
అభయహస్తం: అనుమానాస్పద లింకులు, యాప్‌లు, క్యూఆర్ కోడ్‌లను క్లిక్ చేయొద్దన్న సందేశం ఇచ్చేలా రూపొందించారు. తద్వారా సైబర్ మోసాల నుంచి స్వీయరక్షణ పొందేందుకు అవకాశం.
ఎలుక: గణపతి వాహనమైన ఎలుకను.. మొబైల్ ఇంటర్‌నెట్‌కు అన్వయించారు. ఇంటర్నెట్ ఎలా చకచకా పరుగులు పెట్టినా.. దాని విషయంలో జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ఉండాలన్న సందేశం ఇచ్చారు.
ప్రసాదం ఉండ్రాళ్లు..: గణపతికి ప్రీతిపాత్రమైన మోదకం(ఉండ్రాళ్లు)… పిన్, ఓటీపీ, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు ఖాతా వివరాలకు అన్వయించారు. ప్రసాదం ఎంత పవిత్రంగా భావిస్తామో.. పిన్, ఓటీపీ వంటివాటిని కూడా అంతే పవిత్రంగా భావించి.. జాగ్రత్తగా వ్యవహరించాలన్న సంకేతం ఇచ్చారు.
పెన్ను: గణపతి చేతిలో పెన్ను ఉంటుంది. ఆయన వేదాన్ని రాశారని అంటారు. దీనిని అన్వయిస్తూ.. ఆన్‌లైన్ లావాదేవీల వివరాలను నమోదు చేసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పదంగా ఉన్నవాటిపై వెంటనే స్పందించాలని పోలీసులు సూచిస్తున్నారు. మొత్తంగా ఈ ప్రయత్నం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని.. సైబర్ మోసాల పట్ల అప్రమత్తత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates