కొండా సురేఖ ప్రయాణం ఎటు?

అంతా అనుకున్నట్లే అయ్యింది. మొదట్నుంచి ప్రచారం జరుగుతున్నట్టే మంత్రి కొండా సురేఖ మీద వేటు పడింది. ఆమె రాజీనామా చేయడానికి అంగీకరించక పోవడంతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొండా సురేఖను బర్తరఫ్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు సిఫార్సు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సు లేఖను గవర్నర్ కు పంపించారు. వెంటనే సురేఖను తొలగించాలని లేఖలో కోరారు.

కూతురు సుస్మిత మీద ప్రేమ కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు తెచ్చింది. పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీకి నిలబెట్టాలనుకున్న సురేఖ ఫ్యామిలీ ఎలాంటి వ్యూహం లేకుండా దూకుడుగా వ్యవహారించింది. ఇందుకోసం నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఢీకొనాలని నిర్ణయించడం, సీఎంకు సపోర్టుగా నిలిచిన రాహుల్ గాంధీని కూడా ఇందులోకి లాగేందుకు ప్రయత్నించడం వంటి వరస తప్పులు చేశారు. ముఖ్యమంత్రి కులాన్ని ప్రస్తావించడంతో ఆమెకు సహచర మంత్రుల మద్దతు కూడా లభించలేదు. చివరి నిముషంలో తన మీద వేటు పడటం ఖాయమని తేలిన తర్వాత ఢిల్లీలో మీడియా ముందు మాట్లాడిన మాటలతో ఢిల్లీ పెద్దలు కూడా ఇక లాభం లేదన్న పరిస్థితి కల్పించారని సన్నిహితులు సైతం నొచ్చుకుంటున్నారు.

మొదట్నుంచి కొండా సురేఖ రాజీ పడే మనస్తత్వం కాదు. సర్దుకొనిపోయే తత్త్వం కాదు. ఏ పార్టీలో వున్నా సై అంటే సై అనడమే కానీ ఎక్కడా తగ్గేదే ఉండదు. అదే ఆమె బలం, బలహీనత అని చెప్పొచ్చు. అదే ఆమెను ఎమ్మెల్యే ని చేసింది, మంత్రిని చేసింది. చివరికి బర్తరఫ్ కు కూడా అదే వైఖరి దారితీసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన కొండా సురేఖ 1999లో మొదటిసారి శాయంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 నుంచి కూడా అదే నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డ్ సృష్టించారు. 2009లో పరకాలకు మారిన ఆమె అక్కడ నుంచి కూడా విజయం సాధించిన వైయస్ రాజశేఖర రెడ్డి కేబినేట్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వైస్సార్ మృతి తర్వాత రోశయ్య మంత్రివర్గంలో కొన్నాళ్ళు పనిచేసి జగన్ కు మద్దతుగా రాజీనామా చేశారు. 2011లో వైసీపీలో చేరినప్పటికి అక్కడ ఉండలేక 2014లో టీ ఆర్ఎస్ లో చేరారు. వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి గెలిచారు. అక్కడా ఉండలేక తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.

ఇప్పుడు కొండా సురేఖ తన స్టైల్ మార్చుకున్నట్లు కనిపిస్తుంది. మంత్రి పదవి నుంచి ఆమెను బర్తరఫ్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తుందని ఎదురు చూసిన వాళ్లకు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి కానీ, ఎమ్మెల్యే పదవికి కానీ రాజీనామా చేయట్లేదని ప్రకటించారు. ఎమ్మెల్యేగా కొనసాగుతానని, నన్ను ఎన్నుకున్న ప్రజలకు సేవ చేస్తానంటూ స్పష్టం చేశారు.

నిజంగా ఇది ఒక ట్విస్ట్ అనే చెప్పొచ్చు. దీన్ని ఊహించని రాజకీయ విశ్లేషకులు, విపక్షాలు, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తుపోయారు. అయితే కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లడం కంటే లోపల ఉండి లొల్లి చేయడమే కరెక్టని కొండా ఫ్యామిలీ ఆలోచిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

అయితే ఆమె ఆ మాట మీద నిలబడతారా లేక కొత్త రాగం అందుకుంటారా అన్నది కాలమే తేల్చాలి. తన నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివక్ష చూపినట్లు ఆరోపించిన ఆమె మున్ముందు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని కొందరు ఊహిస్తున్నారు. బీజేపీ నుంచి ఆమెకు ఆఫర్లు వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం మాత్రం ఆగడం లేదు.