వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి పాదయాత్ర చేపట్టేందుకు తేదీ ఖరారైందా? ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. వైఎస్సార్ జయంతి సందర్భంగా 2027 జులై 8న జగన్ పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై వైసీపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
2027 నుంచి మళ్లీ ప్రజల్లోకి వెళ్లి పాదయాత్ర చేస్తానని జగన్ గతంలో పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2027 జులై 8న పాదయాత్ర ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు జరుగుతున్న ప్రచారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
గతంలో వైఎస్ జగన్ 2017 నవంబరులో పాదయాత్ర ప్రారంభించారు. సుమారు 14 నెలలపాటు సాగిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ 2019 జనవరి 9న ముగిసింది. ఆ తర్వాత జరిగిన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
ఈ ఏడాది జూన్‌లో జగన్ చేసిన వ్యాఖ్యలు పాదయాత్ర ప్రచారానికి మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ‘కన్నుమూసి తెరిచేసరికి రెండేళ్లు గడిచాయి. ఇంకా ఉన్నది మూడేళ్లే. మరో ఒకటిన్నర సంవత్సరం పోతే నా పాదయాత్ర స్టార్ట్ అయిపోతది.’ అంటూ జగన్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చెప్పిన కాల వ్యవధికి అనుగుణంగానే 2027లో పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
అయితే పాదయాత్ర ప్రారంభ తేదీ, మార్గం, కార్యక్రమ వివరాలపై వైసీపీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates