కొండా సురేఖకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖను మంత్రివర్గం నుంచి సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కొండా సురేఖ ఇంకా స్పందించాల్సి ఉంది. సురేఖ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరతారంటూ పుకార్లు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే సురేఖకు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

కొండా సురేఖను తన పార్టీలోకి ఆహ్వానించారు కేఏ పాల్. సురేఖ వేరే పార్టీల వైపు చూసే అవసరం లేదని, తన పార్టీ ఉందని పాల్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ లో రెడ్డి సామాజిక వర్గ నేతల పదవులకు ఎటువంటి ఢోకా లేదని, కేవలం బీసీ నాయకుల పదవులకే గ్యారెంటీ లేదని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడం ఒక్క ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యమని, అందుకే తన పార్టీలో చేరాలని సురేఖను పాల్ ఆహ్వానించారు.

ఈ 80 సంవత్సరాల్లో 5 శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గం నుంచి 12 మంది సీఎంలు అయ్యారని, 50 శాతం బీసీలు, 27 శాతం కాపులు ఉన్నామని, 90 శాతం బడుగు బలహీన వర్గాలవారున్నప్పటికీ వారి నుంచి ఒక్కరు కూడా సీఎం కాలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని జగ్గారెడ్డి కూడా విమర్శించారని, కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా విమర్శిస్తుంటారని, కానీ, వారు రెడ్డి సామాజిక వర్గం కాబట్టి వారిపై చర్యలుండవని విమర్శలు గుప్పించారు.