తమిళనాడులో నాలుగు నెలల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జోసెఫ్ విజయ్ ప్రజానుకూల విధానాలతో ముందుకు సాగుతున్నారు. తమిళనాడులో అనేక పుణ్యక్షేత్రాలు వున్నాయి. ప్రసిద్ధి చెందిన దేవాలయాలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పవిత్ర ఆలయాల్లో సెల్ ఫోన్ వినియోగాన్ని నిషేదిస్తూ సీఎం విజయ్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక యువత స్పీడ్ కు బ్రేకులు వేయడం చాలా కష్టంగా మారింది. మొబైల్ ఫోన్లో కెమెరా సౌకర్యం చేతికి వచ్చాక ఆ స్పీడ్ మరింతగా పెరిగింది. దాంతో ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయడానికి రీల్స్ చిత్రీకరించి పోస్టు చేయడం మొదలుపెట్టారు. పవిత్ర ఆలయాల్లో రీల్స్ చిట్రీకరించడం మరీ ఎక్కువై పోయింది. ఇది భక్తులకు ఇబ్బందిగా మారింది. దీన్ని నిశితంగా గమనించిన విజయ్ ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది.
తమిళనాడులోని 52 ప్రసిద్ధ దేవాలయాల్లో సెల్ ఫోన్ వినియోగం పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచే ఈ ఉత్తర్వులు అమలులోకి వచ్చేలా అధికారులను ఆదేశించడం కూడా జరిగిపోయింది. మద్రాస్ హై కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు టీవీకే సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి రమేష్ మీడియాకు తెలిపారు.
ఇందులో భాగంగా అన్నీ దేవాలయాల వద్ద సెల్ ఫోన్లకు అనుమతి లేదు అంటూ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. అలాగే దేవాలయాల ప్రవేశ మార్గం వద్ద సెల్ ఫోన్లను భద్రపరుచుకునేందుకు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో సెల్ ఫోన్ కు 5 రూపాయలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
విజయ్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాలకు వచ్చిన ఆదాయాన్ని ఆలయాలకే ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తులు కానుకల రూపంలో చెల్లించే సొమ్ములు, ఇతరా ఆదాయాన్ని వాణిజ్య అవసరాలకు మళ్ళించకుండా చర్యలు తీసుకున్నారు. దేవుడి సొమ్మును దేవాలయాల అభివృద్ధి, పురాతన దేవాలయాల పునరుద్దరణ, భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి మాత్రమే ఉపయోగించాలని తీసుకున్న నిర్ణయం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడీ సెల్ ఫోన్ నిషేధం పట్ల కూడా సంతోషం వ్యక్తం అవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates