జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలను, మంత్రులను హెచ్చరించడం, అప్రమత్తం చేయడం తరచుగా చంద్రబాబు చేసే పనే..! అయితే ఇక్కడ కూటమిలోని మరో పార్టీ ఎమ్మెల్యే గురించి చెప్పడం రాజకీయంగా చర్చకు దారితీసింది.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని మొగల్తూరులో మంగళవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో ఎమ్మెల్యే నాయకర్ పనితీరుపై మాట్లాడారు.

‘‘ఎమ్మెల్యేగారూ.. మీ పనితీరు బాగోలేదు. మీరు, మీ నియోజకవర్గ అధికారులు సరిగ్గా పనిచేయడం లేదు. జిల్లా బాగుంది.. మీ నియోజకవర్గం మాత్రం బాగోలేదు’’ అని అన్నారు. నియోజకవర్గ పనితీరుకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ.. 25 అంశాలు పాజిటివ్‌గా ఉంటే 23 అంశాల్లో మైనస్‌లో ఉన్నారని సీఎం పేర్కొన్నారు. అక్టోబర్‌లో 21 పాజిటివ్‌ ఉంటే 20 మైనస్‌లో ఉన్నాయని తెలిపారు. ‘‘ఇది ఆమోదయోగ్యం కాదు. ఎమ్మెల్యేగా మీరు పనిచేయాలి.. నరసాపురం వెనుకబడింది’’ అని సూచించారు.

సమస్యలను తన దృష్టికి తీసుకురావడం మాత్రమే కాకుండా.. అవసరమైతే ప్రజల సహకారంతో వాటిని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే చొరవ చూపాలని చంద్రబాబు అన్నారు. నియోజకవర్గ నోడల్‌ అధికారిని మార్చి, చురుగ్గా పనిచేసే అధికారిని నియమించాలని అధికారులకు సూచించారు.

ప్రజావేదికలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే నాయకర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సీఎం సూచనలు చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే నాయకర్‌ మౌనంగా ఉండిపోయారు.