తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి బీ ఫాం ఆరోపణలపై టీ కాంగ్రెస్ కప్పులో తుఫాను రేగడం తెలిసిందే. మొదట్లో వేచి చూసే ధోరణిలో వ్యవహరించిన ఢిల్లీ పెద్దలు అసంతృప్తి రాగాలు శృతిమించడంతో రంగంలోకి దిగింది. క్రమశిక్షణ కమిటీని తెరమీదకు తెచ్చింది. చివరికి కొండా, చిన్నా రెడ్డిలకు షాకాజ్ నోటీసు ఇవ్వడంతో కథ రసకందాయంలో పడింది. ఈ నేపథ్యంలో ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీంను ఢిల్లీకి పిలిచింది. గురువారం ఢిల్లీలో పంచాయతీ జరగనుంది.
ఈ సమావేశంలో ఏమి జరగనుందన్న దానిమీద ఇప్పటికే మీడియాలో రకరకాల కథనాలు ప్రచారం అయ్యాయి. కొండా సురేఖ, చిన్నా రెడ్డిలపై వేటు వేస్తారని, పనిలోపనిగా సురేఖతో మరికొందరిని మంత్రి పదవుల నుంచి తప్పించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు ఇంద్రప్రస్త పొలిటికల్ సర్కిల్ కోడై కూస్తుంది. కొన్ని నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేస్తారని చెబుతున్నారు. స్పీకర్ ప్రసాద కుమార్, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, ఎమ్మెల్సీ విజయశాంతిలకు మంత్రి వర్గంలో స్థానంలో కల్పించనున్నట్లు వినిపిస్తుంది.
ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క లతో పాటుగా ఎమ్మెల్సీ విజయ శాంతి ఢిల్లీకి చేరుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నాయకుల్లో ఢిల్లీ నుంచి ఎవరికైనా పిలుపొచ్చిందో లేదో తెలియదు కానీ మంత్రి కొండా సురేఖకు మాత్రం ఢిల్లీ పెద్దలు పిలిపించారు. దాంతో ఆమె వివేక్ వెంకట స్వామి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటే అదే విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం హస్తినకు వెళ్తారని సన్నిహితులు చెబుతున్నారు. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు కూడా ఢిల్లీకి వెళ్లడంతో పార్టీలో వాడీ వేడిగా చర్చ జరుగుతుంది.
ఒకవేళ మంత్రి వర్గ విస్తరణ జరిగితే ఎవరెవరికి అవకాశం ఉందని నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, నిజామాబాద్ సీనియర్ నాయకుడు జీ. సుదర్శన్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీసీ సామజిక వర్గం నుంచి వేములపాడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, విజయశాంతి పేర్లు మెయిన్ లైన్లో వున్నాయి.
ఎస్టీ కోటా కింద సుగాలి సామజిక వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రాం చందర్ నాయక్ లలో ఒకరికి అవకాశం కల్పించాలని ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ముందుగా ప్రచారం జరుగుతున్నట్లు స్పీకర్ ప్రసాద కుమార్ కు బెర్త్ ఖాయమైనట్లు చెబుతున్నారు. ఆయన స్థానంలో ఎస్సీ వర్గానికి స్పీకర్ పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
ఇంతకూ ఢిల్లీలో ఏమి జరుగుతుందో అర్ధం కాక సామాన్య నాయకులు, కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. మంత్రి పదవికి వేటు పడుతుందని ప్రచారం జరుగుతున్న నాయకుల అనుచరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతున్న నాయకుల అనుచరులు వేయి కళ్ళతో ఢిల్లీ వైపు చూస్తున్నారు. అటు ఇటు ఒకరకమైన ఆందోళన, ఆతృత కనిపిస్తుంది. ఎప్పుడు ఏ సమాచారం వస్తుందోనని కాంగ్రెస్ శ్రేణులు మొబైల్ ఫోన్లకు అతుక్కొని పోయారు. సగం మంది నాయకులు ఢిల్లీలో ఉండటంతో రాజకీయ విశ్లేషకులు సైతం బిజీలో వున్నారు. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కూడా ఓ కన్నేసినట్లు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
